Rajinikanth: రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్.. ఏంటిది?
Rajinikanth: తలైవా రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్ 2023 గోల్డెన్ టికెట్ అందించింది బీసీసీఐ. దీన్ని రజినీకి అందించారు బీసీసీఐ కార్యదర్శి జైషా. వివరాలివే..
Rajinikanth: తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీ అంటే కోట్లాది మంది అభిమానులు ఇష్టపడతారు. కొందరు ఏకంగా ఆరాధిస్తారు. ఇటీవల ఆయన నటించిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650కోట్లకు పైగా కలెక్షన్లతో బంపర్ హిట్ అయింది. కాగా, రజినీకాంత్‍కు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. కొన్నిసార్లు ఆయన స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్‍లు చూస్తుంటారు. ముంబైలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు కూడా ఆయన హాజరయ్యారు. ఆ ప్రపంచకప్‍ను టీమిండియా గెలువగా.. ఆయన చాలా సంతోషించారు. కాగా, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య భారత్ వేదికగా జరగనుంది. ఈ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) రజినీకి ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. ఆ వివరాలివే..
తలైవా రజినీకాంత్.. 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా నేడు రజీనికి ఈ గోల్డెన్ టికెట్ అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
“బీసీసీఐ కార్యదర్శి జైషా.. రజినీకాంత్‍కు గోల్డెన్ టికెట్ అందించారు. భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‍లకు తలైవా వస్తారని చెప్పేందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. విశిష్ట అతిథిగా ఆయన ప్రపంచకప్‍కు హాజరుకానున్నారు. అతిపెద్ద క్రికెట్ సంబరాన్ని మరింత గ్రాండ్‍గా చేయనున్నారు” అని బీసీసీఐ ట్వీట్ చేసింది. రజినీకి జై షా గోల్డెన్ టికెట్ అందిస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది.
గోల్డెన్ టికెట్ అంటే..
గోల్డెన్ టికెట్ ఉన్న వారు 2023 వన్డే ప్రపంచకప్‍లో ఏ మ్యాచ్‍నైనా స్టేడియంలోని ప్రత్యేక వీఐపీ బాక్సు నుంచి ఉచితంగా వీక్షించవచ్చు. అన్ని మ్యాచ్‍లకు యాక్సెస్ ఉంటుంది. మరిన్ని వీఐపీ ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‍కు గోల్డెన్ టికెట్ దక్కగా.. ఇప్పుడు తలైవా రజినీ కూడా అందుకున్నారు. దక్షిణాది నుంచి 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందుకున్న తొలి సెలెబ్రిటీగా రజినీ నిలిచారు.