Rajinikanth Biggest Flop Movie: రజనీకాంత్ కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్ మూవీ ఇది.. కోట్లలో నష్టాలు.. రీరిలీజ్‌లో మాత్రం హిట్
Rajinikanth Biggest Flop Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఓ అతిపెద్ద ఫ్లాప్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా కోట్లల్లో నష్టాలను మిగిల్చగా.. రజనీ తన సొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. అయితే రీరిలీజ్ లో మాత్రం మూవీ హిట్ కావడం విశేషం.
Rajinikanth Biggest Flop Movie: తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ ను మించిన సూపర్ స్టార్ లేడు. ముఖ్యంగా 1980, 90ల్లో రజనీ ఓ సినిమాలో నటిస్తున్నాడంటే చాలు సూపర్ హిట్ అని ముందే డిసైడైపోయే రేంజ్ అతనిది. అయితే అంతటి స్టార్ కెరీర్లోనే ఓ అతిపెద్ద ఫ్లాప్ ఉంది. ఆ సినిమా పేరు బాబా. ఈ మూవీ దెబ్బకు రజనీ రెండేళ్ల పాటు సినిమాలకే దూరంగా ఉన్నాడు.
రజనీకాంత్ కొంప ముంచిన బాబా
రజనీకాంత్ తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనూ మధ్య మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అలా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా గడిపి వస్తాడు. ఈ బాబా సినిమాకు ముందు కూడా రజనీ పరిస్థితి అలాగే ఉంది. అంతకుముందు అరుణాచలం, నరసింహలాంటి హిట్ సినిమాలతో ఊపు మీదున్నా.. రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
తిరిగి 2002లో ఈ బాబా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేశ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. మనీషా కొయిరాలా ఫిమేల్ లీడ్ గా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సినిమా ఇది. దీంతో మూవీని ఆ కాలంలోనే రూ.17 కోట్ల భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. కానీ చివరికి సినిమా బోల్తా కొట్టింది.
మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో కేవలం రూ.13 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది. ఎంతో మంది రజనీని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్ల నష్టాల పాలయ్యారు. దీంతో రజనీకాంతే తన సొంత డబ్బు వాళ్లకు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా సుమారు రూ.3 కోట్లను రజనీ తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత రజనీకాంత్ మూడేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు.
బాబానే అతని కెరీర్లో చివరి సినిమా అని, ఇక అతడు తిరిగి తెరపైన కనిపించడు అన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయి ఫెయిల్యూర్ ను రజనీ జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. మూడేళ్లకు మళ్లీ చంద్రముఖి మూవీతో రజనీ హిట్ కొట్టాడు.
బాబా.. రీరిలీజ్‌లో మాత్రం సక్సెస్
బాబా మూవీ తొలిసారి థియేటర్లలో రిలీజై సూపర్ ఫ్లాపయిన ఇరవై ఏళ్లకు అంటే డిసెంబర్, 2022లో రీరిలీజైంది. ఈసారి మాత్రం సినిమా హిట్ అవడం విశేషం. బాబా రీరిలీజ్ లో మంచి వసూళ్లు సాధించింది. సుమారు రూ.4 కోట్ల వరకూ వసూలు చేయడం గమనార్హం. అప్పట్లో రిలీజైన మూవీని కట్ చేసి తక్కువ నిడివితో తిరిగి రిలీజ్ చేయడం కూడా కలిసొచ్చింది.
ఈ మూవీలో తాను బీడీ తాగడం కూడా కాస్త నష్టం చేసినట్లు రజనీకాంత్ అప్పట్లో భావించాడు. రిరిలీజ్ లో హిట్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లకు రజనీ ప్రత్యేకంగా గిఫ్ట్ లు పంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలోనూ రజనీ సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. గతేడాది వచ్చిన జైలర్ మాత్రమే భారీ వసూళ్లు సాధించింది. ఈ మధ్యే అతడు అథితి పాత్రలో కనిపించిన లాల్ సలామ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.