Oscars Ticket Price: ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకొని చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఆస్కార్ ఈవెంట్‌లో కీరవాణి, చంద్రబోస్‌తో పాటు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి రాజమౌళి భారీగానే ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ ఈవెంట్స్ టికెట్స్ కోసమే ఆయన కోటిన్నరకుపైగా వెచ్చించినట్లు చెబుతున్నారు. విన్నర్స్‌కు మాత్రమే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో టికెట్స్ కొనుగోలు చేయకుండా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వారితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్‌ను మాత్రమే ఉచితంగా వేడుకను వీక్షించడానికి అనుమతి ఇస్తారు.
మిగిలిన వారు ఆస్కార్ ఈవెంట్‌ను లైవ్‌గా వీక్షించాలంటే టికెట్ కొనాల్సిందే. ఈ ఏడాది ఒక్కో టికెట్ ధరను ఇరవై లక్షల అరవై వేలుగా ఫిక్స్ చేశారట. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు మిగిలిన వారందరూ టికెట్స్ కొనుగోలు చేసి ఆస్కార్ ఈవెంట్‌కు హాజరైనట్లు సమాచారం.
కీరవాణి, చంద్రబోస్ మాత్రమే విన్నర్స్ కేటగిరీలో ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆస్కార్ ఈవెంట్ టికెట్స్ కోసం రాజమౌళి దాదాపు కోటి నలభై ఐదు లక్షల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అది పెద్ద మొత్తమే అయినా తమ సినిమాకు అవార్డును ప్రకటించే క్షణాలను ప్రత్యక్షంగా ఆనందించడం కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్ వేర్వేరుగా ఇండియాకు తిరిగివచ్చారు. మార్చి 15న ఎన్టీఆర్ ఇండియాకు రాగా రాజమౌళితో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ శుక్రవారం ఇండియా చేరుకున్నారు. రామ్‌చరణ్ కూడా శుక్రవారమే ఇండియాకు వచ్చాడు.