Lavanya on Raj Tharun: రాజ్‍తరుణ్ రూ.5కోట్లు ఇస్తానంటుడున్నాడు.. కానీ: లావణ్య
Lavanya on Raj Tarun: రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం ముదురుతూనే ఉంది. ఆరోపణలు, ఫిర్యాదులతో రచ్చ కొనసాగుతోంది. రాజ్ తరుణ్ తరుణ్ తనకు డబ్బు ఆఫర్ చేశాడని లావణ్య తాజాగా ఆరోపించారు.

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్య మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. రాజ్ తరుణ్ తనను వాడుకొని వదిలేశాడని ఇటీవలే లావణ్య బయటికి వచ్చారు. ఆ తర్వాతి నుంచి పోలీస్ కేసులు, ఆరోపణలతో ఈ వివాదం సాగుతోంది. లావణ్య ప్రతీ రోజూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను కూడా భయపెట్టేశారు. రాజ్ తరుణ్ తనకు కావాలంటూ చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా లావణ్య మరో విషయం వెల్లడించారు. కేసు వెనక్కి తీసుకోవాలని రాజ్ తరుణ్ తనకు డబ్బు ఆఫర్ చేస్తున్నాడని చెప్పారు.
రూ.5కోట్లు ఇస్తామంటూ..
తనపై ఇచ్చిన పోలీస్ కేసు వెనక్కి తీసుకుంటే రూ.5కోట్లు ఇస్తానని రాజ్ తరుణ్ చెబుతున్నాడని లావణ్య తాజాగా ఆరోపించారు. ఈ విషయంపై తనకు ఇప్పటికే ఇద్దరితో కాల్ చేయించాడని వెల్లడించారు. రాజ్ తరుణ్ మేనేజర్, అతడి లాయర్ తనకు కాల్ చేసి.. ఈ ఆఫర్ చెప్పారని లావణ్య వెల్లడించారు.
తనకు రూ.5కోట్లను వారు ఆఫర్ చేస్తున్నారని, కానీ తనకు కావాల్సింది డబ్బు కాదని లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్‍తో జీవితం కొనసాగించడమే తనకు కావాలని ఆమె చెప్పారు. మొత్తంగా డబ్బు ఆఫర్ ఆరోపణలతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది.
తనకు, రాజ్ తరుణ్‍కు 2014లోనే పెళ్లయిందని లావణ్య చెబుతున్నారు. తాము అప్పటి నుంచే కాపురం చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. అయితే, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పరిచయం అయ్యాక తనను రాజ్ తరుణ్ వదిలేశాడంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. తనకు అబార్షన్ కూడా చేయించారని పేర్కొన్నారు. కొన్ని ఆధారాలతో సహా కంప్లైట్ ఇచ్చారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్‍పై కేసు కూడా నమోదు చేశారు.
రాజ్ తరుణ్‍పై లావణ్య నమోదు చేసిన కేసును ప్రస్తుతం నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం అడిగినట్టు సమాచారం. మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని లావణ్యపై కూడా కేసు పెట్టారు మాల్వీ మల్హోత్రా. ఇలా పరస్పర కేసులు నమోదయ్యాయి.
అర్ధరాత్రి హైడ్రామా
లావణ్య ఆత్మహత్య బెదిరింపులతో ఇటీవలే అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. తాను సూసైడ్ చేసుకుంటున్నానని తన లాయర్‌కు లావణ్య మెసేజ్ పంపారు. అలాగే, పోలీసులకు ఫోన్ చేసి కూడా ఈ విషయం చెప్పారు. దీంతో అర్ధరాత్రి నార్సింగి పోలీసులు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో టెన్షన్ నెలకొంది. మొత్తంగా నార్సింగి పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
రాజ్ తరుణ్ తమ కుటుంబం వద్ద దశల వారిగా రూ.50లక్షలు తీసుకున్నారని మరో సందర్భంలో ప్రెస్‍మీట్ పెట్టి మరీ ఆరోపించారు లావణ్య. మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా చెప్పారు. రాజ్ తరుణ్ కోసమే తాను పోరాటం చేస్తున్నానని వివరించారు. తనను వారు బెదిరిస్తున్నారని, ఆ వేదన భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. మరోవైపు డబ్బు కోసమే లావణ్య ఇలా చేస్తోందని, తాను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. నిజాలు నిగ్గుతేలి ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.