Raghu Thatha Review: రఘు తాత రివ్యూ - ఓటీటీలో రిలీజైన కీర్తిసురేష్ సెటైరిక‌ల్‌ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-raghu thatha movie review keerthy suresh kollywood comedy drama movie review zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raghu Thatha Review: రఘు తాత రివ్యూ - ఓటీటీలో రిలీజైన కీర్తిసురేష్ సెటైరిక‌ల్‌ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Raghu Thatha Review: రఘు తాత రివ్యూ - ఓటీటీలో రిలీజైన కీర్తిసురేష్ సెటైరిక‌ల్‌ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 14, 2024 06:07 PM IST

Raghu Thatha Review: కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ర‌ఘు తాత మూవీ ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

రఘు తాత రివ్యూ
రఘు తాత రివ్యూ

Raghu Thatha Review: కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన కామెడీ డ్రామా మూవీ ర‌ఘు తాత మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వీంద్ర విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియెన్స్‌ను ర‌ఘుతాత‌ మెప్పించిందా? అంటే?

క‌య‌ల్ సిద్ధాంతాలు...

క‌య‌ల్ విజీ పాండియ‌న్ అలియాస్ క‌య‌ల్ (కీర్తి సురేష్‌) బ్యాంకు ఉద్యోగి. సొసైటీలో పురుషుల‌తో స‌మానంగా స్త్రీల‌కు హ‌క్కులు ఉండాల‌ని కోరుకుంటుంది క‌య‌ల్‌. పెళ్లికి దూరంగా ఉంటూ త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా స్వేచ్ఛ‌గా బ‌త‌కాల‌ని క‌ల‌లుకంటుంది. స్త్రీవాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ కాపా అనే మారుపేరుతో ర‌చ‌న‌లు చేస్తుంటుంది.

రంగు అనే ప్ర‌భుత్వ అధికారి హిందీ భాష‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా నేర్చుకోవాలంటూ క‌య‌ల్ ఊళ్లో ఏక్తా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తాడు. తాత‌య్య ర‌ఘోత్త‌మ్‌తో (ఎమ్ఎస్ భాస్క‌ర్‌) క‌లిసి ఏక్తా స‌భ‌ను నిర్వ‌హించ‌కుండా అడ్డుకుంటుంది క‌య‌ల్‌. మాతృభాష‌ను కాపాడిన వీర‌వ‌నిత అంటూ ఊళ్లోవాళ్లంద‌రూ క‌య‌ల్‌కు స‌న్మానం చేస్తారు.

బ్యాంకు ఉద్యోగంలో క‌య‌ల్‌కు ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. కానీ హిందీ నేర్చుకోవాల‌ని కండీష‌న్ పెడ‌తారు. హిందీ భాష‌పై కోపంతో ప్ర‌మోష‌న్‌ను కాదంటుంది. అదే టైమ్‌తో తాత‌య్య ర‌ఘు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌తాడు.

తాత‌య్య చివ‌రి కోరిక మేర‌కు త‌మిళ్ సెల్వ‌న్ (ర‌వీంద్ర విజ‌య్‌) అనే ప్ర‌భుత్వ అధికారిని పెళ్లిచేసుకోవ‌డానికి క‌య‌ల్ ఒప్పుకుంటుంది. క‌య‌ల్ ర‌చ‌న‌ల‌ను సెల్వ‌న్ అభిమానిస్తుంటాడు. ఆద‌ర్శ‌వాదిగా క‌నిపించే త‌మిళ్ సెల్వ‌న్ ...క‌య‌ల్ స్వేచ్ఛ‌ను, సిద్ధాంతాల‌ను కాల‌రాయ‌డ‌మే కాకుండా ఆమెను ఇంటికే ప‌రిమితం చేయాల‌నే ఆలోచ‌న‌తోనే పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు. అత‌డి నిజ‌స్వ‌రూపం కయ‌ల్‌కు తెలిసిపోతుంది.

పెళ్లిని అడ్డుకోవ‌డానికి హిందీ ఎగ్జామ్ రాసి కోల్‌క‌తాకు ట్రాన్స్‌ఫ‌ర్‌పై వెళ్లిపోవాల‌ని కయ‌ల్ ప్లాన్ చేస్తుంది. ఊళ్లో వాళ్ల‌తో పాటు తాత‌య్య‌కు తెలియ‌కుండా హిందీ ఎగ్జామ్ రాసేందుకు కయ‌ల్ ఎలాంటి క‌ష్టాలు ప‌డింది? సెల్వ‌న్‌తో త‌న పెళ్లి జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌డానికి కయ‌ల్ వేసిన ప్లాన్స్ స‌క్సెస్ అయ్యాయా? క‌య‌ల్‌పై రివేంజ్ తీర్చుకోవ‌డానికి సెల్వ‌న్ ఏం చేశాడు? పీట‌ల వ‌ర‌కు వ‌చ్చిన పెళ్లి ఆగిందా? లేదా? అన్న‌దే ర‌ఘు తాత మూవీ క‌థ‌.

కామెడీ డ్రామా మూవీ...

ర‌ఘు తాత పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ డ్రామా మూవీ. హిందీ భాష త‌ప్ప‌న‌స‌రి అనే రూల్ ప‌ట్ల త‌మిళ‌నాడులో ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు సుమ‌న్ కుమార్ ఈ క‌థ‌ను రాసుకున్నారు.

అంత‌ర్లీనంగా ఈ క‌థ‌లో పురుషాధిక్యత‌తో కూడిన సొసైటీలో త‌మ హ‌క్కుల, స్వేచ్ఛ కోసం స్త్రీలు చేసే పోరాటం, మ‌హిళ‌ల ప‌ట్ల స‌మాజంలో ఉన్న‌ వివ‌క్ష‌ను అంత‌ర్లీనంగా ఈ సినిమాలో ట‌చ్ చేశారు. సీరియ‌స్ ఇష్యూస్‌ను ఫ‌న్నీగా ఈ సినిమాలో చూపించారు. న‌వ్విస్తూనే తాను చెప్పాల‌నుకున్న అంశాన్ని సున్నితంగా చ‌ర్చించిన‌ విధానం బాగుంది.

క‌య‌ల్ నో కాంప్ర‌మైజ్‌...

క‌య‌ల్ సిద్ధాంతాలు, హిందీ స‌భ జ‌ర‌గ‌కుండా చేసి ఊరి వారంద‌రికి ఎలా రోల్ మోడ‌ల్‌గా నిలిచింద‌నే అంశాల‌తో సినిమా మొద‌ల‌వుతుంది. క‌య‌ల్ అభిమానిస్తున్న‌ట్లు సెల్వ‌న్ న‌టిస్తూ ఆమె వెంట తిర‌గ‌డం, హ‌క్కుల విష‌యంలో కాయ‌ల్ కాంప్ర‌మైజ్ కాన‌ట్లుగా చూపిస్తూ క‌థ‌ను ముందుకు న‌డిపించారు డైరెక్ట‌ర్‌. కా పాండియ‌న్ పేరుతో ర‌చ‌న‌లు చేస్తుంది పురుషుడు కాదు స్త్రీ అంటూ క‌య‌ల్ ఉనికి బ‌య‌ట‌పెడుతూ సెల్వ‌న్ రాసిన ఆకాశ‌రామ‌న్న ఉత్త‌రం బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టి నుంచే క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

సెల్వ‌న్‌తో పెళ్లిని అడ్డుకోవ‌డానికి అన్న‌, వ‌దిన‌ల‌తో క‌లిసి కయ‌ల్ వేసే ప్లాన్స్ నుంచి చ‌క్క‌టి వినోదాన్ని రాబ‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు. అమాయ‌కంగా క‌నిపించే వ‌దిన క్యారెక్ట‌ర్ ఇచ్చే ఐడియాలు న‌వ్విస్తాయి. క‌య‌ల్ ప్లాన్స్‌ను క‌నిపెట్టిన సెల్వ‌న్ పెళ్లి ఎలాగైన జ‌ర‌గ‌డానికి ఏం చేశాడ‌నే చిన్న పాటి స‌స్పెన్స్‌తో సినిమాను ఎండ్‌చేశారు.

క‌న్ఫ్యూజింగ్‌...

క్లైమాక్స్ చాలా క‌న్ఫ్యూజింగ్‌గా ముగిసిన‌ట్లుగా అనిపిస్తుంది. క‌య‌ల్ హిందీని ఎందుకు ద్వేషిస్తుంది అన్న‌ది స‌రిగ్గా చూపించ‌లేదు. పెళ్లి అడ్డుకునేందుకు క‌య‌ల్ వేసిన క్లైమాక్స్ ప్లాన్ అంత‌గా ఆక‌ట్టుకోదు.సినిమా కథ, కథనాలు చాలా స్లోఫేజ్‌లో సాగుతాయి. కొన్ని సార్లు ఆర్ట్ ఫిల్మ్ చూసిన అనుభూతిని క‌లిగిస్తుంది.

కీర్తి సురేష్ వంద‌శాతం న్యాయం...

క‌య‌ల్ పాత్ర‌కు కీర్తి సురేష్ వంద‌శాతం న్యాయం చేసింది. స్త్రీల హ‌క్కుల కోసం పోరాడే యువ‌తిగా, త‌న సిద్ధాంతాల‌కు, కుటుంబ బంధాల‌కు మ‌ధ్య న‌లిగిపోయే సగ‌టు అమ్మాయి అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ర‌వీంద్ర విజ‌య్‌, ర‌ఘుతాత‌గా ఎఎమ్ఎస్ భాస్క‌ర్‌ల న‌ట‌న బాగుంది.

ఫీల్‌గుడ్ మూవీ...

ర‌ఘు తాత డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఫీల్‌గుడ్ కామెడీ మూవీ. కీర్తి సురేష్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది.