Racharikam Review: రాచరికం రివ్యూ - వరుణ్ సందేశ్ విలన్‌గా నటించిన మూవీ ఎలా ఉందంటే?
Racharikam Review: పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు మూవీ రాచరికం శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో అప్సరారాణి, వరుణ్ సందేశ్, విజయ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు.
Racharikam Review: అప్సరారాణి, వరుణ్ సందేశ్, విజయ్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన రాచరికం మూవీ జనవరి 31న (నేడు) థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎలా ఉందంటే?

రాచకొండ కథ...
రాచకొండ ప్రాంతంలో రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) చెప్పిందే వేదం. రాజారెడ్డి కొడుకు వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్)తో పాటు కూతురు భార్గవి రెడ్డి (అప్సరా రాణి) తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెడతారు. శివ (విజయ్ శంకర్) అనే యువకుడిని భార్గవి రెడ్డి ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కారణంగా రాజారెడ్డి రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?
శివ, భార్గవి ప్రేమకు కులమతాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయి? రాచకొండలో ఎన్నికలు జరగాలని శివ పట్టుపట్టడానికి కారణం ఏమిటి? రాజకీయాల్లో వివేక్ రెడ్డికి భార్గవి ప్రత్యర్థిగా ఎందుకు మారింది? వీరి కథలో భైర్రెడ్డి , క్రాంతి(ఈశ్వర్) పాత్రలు ఏమిటి? రాచకొండలో మార్పు కోసం భార్గవి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్నదే రాచరికం మూవీ కథ.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సురేష్ లంకలపల్లి రాచరికం మూవీని తెరకెక్కించాడు. సమాజంలోని పురుషాధిక్యత, కుల వివక్షతో లాంటి అంశాలకు లవ్‌స్టోరీని జోడించి ఈ కథను రాసుకున్నాడు. వారసులుగా మగపిల్లలే ఉండాలనే సమాజంలో నెలకొన్న అపోహలు? ఆడపిల్లల పెంపకం విషయంలో కుటుంబం నుంచే అసమానతలు ఎలా మొదలవుతుంటాయి? అన్నది ఆలోచనాత్మకంగా రాచరికం సినిమాలో చర్చించారు. తాను చెప్పాలనుకున్న మెసేజ్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఈ మూవీలో చూపించారు.
లవ్ స్టోరీ...
రాచకొండ ప్రాంతంలో రాజకీయ అధిపత్యం కోసం జరిగే పోరుతో పాటు శివ, భార్గవి ప్రేమకథను ఆవిష్కరిస్తూ ఫస్ట్ హాఫ్‌ను నడిపించాడు దర్శకుడు. యాక్షన్, వయలెన్స్ అంశాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా అనిపించింది. లవ్ ట్రాక్‌లో నాయకానాయికల కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయ్యింది. అప్పరా రాణి గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది.
ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో కలిగేలా చేశారు. వివేక్, భార్గవి ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. పొలిటికల్‌గా ఎదగాలని కలలు కన్న భార్గవికి సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయన్నది చూపించిన తీరు బాగుంది. . మెసేజ్‌తో క్లైమాక్స్‌ను ఎండ్ చేశారు. కంప్లీట్‌గా ఈ మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ ప్రాంత యాసలోనే డైలాగ్స్ రాసుకోవడం ప్లస్సయ్యింది.
కొత్తదేమీ కాదు...
రాచరికంలో దర్శకుడు చెప్పిన పాయింట్ కొత్తదేమీ కాదు. ఈ పాయింట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. స్క్రీన్‌ప్లే రొటీన్‌గా సాగడం, సెకండాఫ్‌లో క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా ఎలివేట్ కాలేని ఫీలింగ్ కలుగుతుంది.
అప్సరరాణి...
రాచరికం మూవీలో అప్సరరాణి డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించింది. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో మెప్పించింది. సెకండాఫ్‌లో సర్‌ప్రైజింగ్‌గా ఆమె క్యారెక్టర్ సాగుతుంది. లవర్ బాయ్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఇందులో నెగెటివ్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించాడు. సీరియస్ రోల్‌కు న్యాయం చేశాడు. నటుడిగా అతడిని కొత్త కోణంలో ఆవిష్కరించే మూవీ ఇది. విజయ్ శంకర్ హీరోగా ఓకే అనిపించాడు. విజయరామరాజు విలనిజం సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. వెంగీ పాటలు, బీజీఎమ్ అసెట్‌గా నిలిచాయి.
యాక్షన్ థ్రిల్లర్...
రాచరికం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వరుణ్ సందేశ్, అప్సరారాణి యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.
రేటింగ్:2.5/5