R Madhavan: సిక్స్ ప్యాక్ లేకపోయినా, డ్యాన్స్ రాకపోయినా 25 ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నా: మాధవన్ కామెంట్స్ వైరల్
R Madhavan: ఆర్ మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు సిక్స్ ప్యాక్ లేకపోయినా, డ్యాన్స్ రాకపోయినా 25 ఏళ్లుగా హీరోగా రాణిస్తున్న విషయాన్ని అతడు గుర్తు చేశాడు. ఈ మధ్యే అతడు హిసాబ్ బరాబర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
R Madhavan: మాధవన్ తెలుసు కదా. 1990ల చివర్లో తన నవ్వుతో ఎంతో మంది అమ్మాయిల మనసు దోచిన హీరో అతడు. ఈ మధ్యే జీ5 ఓటీటీలోకి నేరుగా వచ్చిన హిసాబ్ బరాబర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్ తో అతడు మాట్లాడాడు. ఓ సూపర్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు తనకు లేకపోయినా తాను ఎలా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నానో అతడు చెప్పుకొచ్చాడు.

"నేను నా సమయాన్ని ఎక్కువగా వ్యక్తులను పరిశీలించడానికి ఉపయోగిస్తాను. అదే నేను 25 ఏళ్లయినా రాణిస్తుండటానికి కారణం. ఓ సూపర్ హీరో లక్షణాలైన సిక్స్ ప్యాక్ లేదు, డ్యాన్స్ రాదు. అయినా నేను రాణిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన జనరేషన్ ను నేను సరిగ్గా చిత్రీకరించగలుగుతున్నాను" అని మాధవన్ అన్నాడు.
ఈ తరం భిన్నమైనది ఎందుకంటే..
ఈ తరాన్ని తాను ఎందుకంత క్లిష్టమైనదని అన్నానో కూడా ఈ సందర్భంగా మాధవన్ వివరించాడు. "నా తరం ఇండియన్స్ చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లే. వాళ్లు ఐటీ, పాలిటిక్స్, బిజినెస్ ఇలా దేన్నయినా శాసిస్తున్నారు. గతంలో ఏ తరం చూడనంత వేగంగా ప్రపంచం మారిపోవడాన్ని మా తరం చూసింది. మా జీవితాల్లో మేము ఎస్టీడీ బూతుల నుంచి పేజర్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకూ అన్నింటినీ చూశాం. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది" అని మాధవన్ చెప్పాడు.
ఇప్పుడు సగటు పౌరుడు ఏమాత్రం అమాయకుడు కాదని, అతని పాత్ర ఎలా పోషించాలో తనకు బాగా తెలుసని మాధవన్ అన్నాడు. నాలుగేళ్లు సినిమాలు చేయకపోతే జనం మరచిపోతారని, అంత పోటీ సినిమాల్లో ఉన్నదని, అయితే మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోగలిగితే ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని మాధవన్ చెప్పాడు.