Sathi Gani Rendu Ekaralu Review : 'సత్తి గాని రెండెకరాలు' ఏం చేశాడు?.. సినిమా రివ్యూ-pushpa fame jagadeesh prathap bandari sathi gani rendu ekaralu movie review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa Fame Jagadeesh Prathap Bandari Sathi Gani Rendu Ekaralu Movie Review Telugu

Sathi Gani Rendu Ekaralu Review : 'సత్తి గాని రెండెకరాలు' ఏం చేశాడు?.. సినిమా రివ్యూ

Anand Sai HT Telugu
May 26, 2023 01:00 AM IST

Sathi Gani rendu Ekaralu Movie Review : పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి హీరోగా నటించిన చిత్రం సత్తి గాని రెండు ఎకరాలు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

సత్తి గాని రెండు ఎకరాలు
సత్తి గాని రెండు ఎకరాలు (Twitter)

Sathi Gani rendu Ekaralu Cinema Review : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో.. హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసిన కేశవ పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్ చేసింది నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. తాజాగా జగదీష్ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా వచ్చింది. అదే 'సత్తి గాని రెండు ఎకరాలు'. ఈ సినిమా ఆహాలో మే 26న విడుదలైంది.

నటీనటులు : జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మురళీధర్, రాజ్ తిరందాసు, అనీష్ దామ తదితరులు, దర్శకత్వం : అభినవ్ దండా, నిర్మాతలు : మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యర్నేని, వై రవిశంకర్)

కథ

కొల్లూరు అనే గ్రామంలో సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి) అనే వ్యక్తి ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా.. ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని అతడికి తాత చిన్నప్పుడే చెబుతాడు. ఉన్నదంతా మీ నాన్న అమ్మేసి.. చివరకి రెండు ఎకరాలు మిగిలిచ్చాడని వివరిస్తాడు. ఆ మాటలు సత్తికి అలాగే గుర్తుంటాయి. పెద్దై పెళ్లి చేసుకుంటాడు. సత్తికి ఓ కొడుకు, కుమార్తె ఉంటారు. కుమార్తెకు గుండె జబ్బు ఉంటుంది. వైద్యం చేయించాలంటే చాలా డబ్బులు కావాలి. తన దగ్గర ఉన్న ఆటోను అమ్మేస్తాడు. కానీ ఆ డబ్బులు సరిపోవు. ఓ వైపు భార్య ఎప్పుడూ ఏం సంపాదన లేదు అని తిడుతూనే ఉంటుంది. తనకు దగ్గరి చుట్టమైన సర్పంచ్(మురళీధర్) దగ్గర కొన్ని డబ్బులు అడుగుతాడు సత్తి.

సత్తికి కొంత డబ్బులు ఇస్తాడు సర్పంచ్. అయితే అతడి పొలం పక్కనే ఉన్న సత్తి రెండు ఎకరాల పొలం కొనుగోలు చేస్తే.. ఓ కంపెనీకి అమ్మేయోచ్చనే ఆలోచనలో ఉంటాడు. అప్పటికే డీలింగ్ కుదుర్చుకుంటాడు. సత్తి చేతిలో ఉన్న డబ్బులతో కేవలం కూతురుకి ఇంజక్షన్ మాత్రమే వస్తుంది. ఓ రోజు సత్తి సైకిల్ మీద వెళ్తుంటే.. అతడి పక్క నుంచే వెళ్లిన ఓ కారు.. చెట్టు ఢీ కొడుతుంది. అందులోని వ్యక్తికి గాయాలు ఎక్కువగా అవుతాయి. ఇది చూసిన సత్తి కారు దగ్గరకు వెళ్తాడు. అయితే అందులోని సూట్ కేస్ మాత్రమే తీసుకొస్తాడు. డబ్బులు ఉంటే కుమార్తెకు ఆపరేషన్ చేయించొచ్చు అని ఆలోచన. కానీ అది ఎలా తెరవాలని మాత్రం సత్తికి తెలియదు.

వెంటనే తన స్నేహితుడు అంజి(రాజ్ తిరందాస్) గుర్తుకు వస్తాడు. అప్పటికే వీళ్లు ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉంటారు. సూట్ కేస్ ను ఎలాగైనా ఓపెన్ చేయాలని చూస్తారు. మరోవైపు సూట్ కేస్ ఓనర్ వెన్నెల కిషోర్ ను యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి పంపిస్తాడు. అక్కడకు వచ్చిన అతడు కారుతోపాటుగా అందులోని వ్యక్తిని కూడా కాల్చేస్తాడు. సూట్ కేస్ కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఇంకోవైపు సత్తి కుమార్తెకు ఆపరేషన్ చేయించాలని అతడి భార్య పోరు పెడుతుంది. మరోవైపు సర్పంచ్ బిడ్డ అంజితో ప్రేమలో ఉంటుంది. సూట్ కేస్ ఓపెన్ అయ్యాక పారిపోవాలని చూస్తారు. కారు ప్రమాదం గురించి ఎస్సై(బిత్తిరి సత్తి) ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు.

ఒకరోజు ఎలాగోలా సూట్ కేస్ తెరుచుకుంటుంది. అందులో వజ్రాల్లాంటివి కొన్ని ఉంటాయి. వాటిని ఎలాగైనా అమ్మేయాలని చూస్తారు. ఇంతకీ ఆ సూట్ కేస్ లో ఉన్నవి ఏంటివి? వజ్రాలేనా? సత్తి రెండు ఎకరాలు అమ్మేశాడా? సత్తి కుమార్తెకు ఆపరేషన్ అయిందా? వెన్నెల కిషోర్ పోలీసులకు దొరికాడా? సర్పంచ్ బిడ్డతో అంజి ప్రేమ ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే సత్తి గాని రెండు ఎకరాలు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ మధ్య కాలంలో ప్రాంతీయ సినిమాలు, కంటెంట్ ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే కోవలో సత్తిగాని రెండు ఎకరాలు సినిమాను తీశారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఎలా కుటుంబ పెద్ద సతమతమవుతాడో ఈ సినిమాలో చూపించారు. జగదీష్ ప్రతాప్ బండారి నటన మాత్రం బాగుంటుంది. ప్రతీ సీన్లో లీనమైపోయాడు. అతడికి తోడుగా రాజ్ తిరందాసు యాక్టింగ్ కూడా ప్లస్ పాయింట్. పెద్ద పెద్ద లొకేషన్స్ జోలికి పోకుండా.. ఒక్క ఊరి చుట్టే కథను తిప్పాడు దర్శకుడు. ఓ వైపు కుమార్తె కోసం తండ్రి ఎంత ఆరాటపడుతాడో చూపిస్తూనే.. అత్యవసర సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చూపించాడు.

సినిమాలో ప్రతీ పాత్ర.. ఎంత కావాలో అంతే నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ.. కొన్ని చోట్ల నచ్చుతుంది. ఏదో మన పక్కనే కథ జరుగుతుందనిపించేలా ఉంది. సత్తి కొడుకు వేసే కొన్ని కొన్ని పంచ్ లు మాత్రం హైలెట్ గా ఉంటాయి. సత్తి భార్య నటన కూడా బాగుంటుంది. మురళీధర్ సర్పంచ్ గా ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది.. కొన్ని కొన్ని సీన్లలో పనితనం కనిపిస్తుంది. పల్లెటూరిలోనే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సత్తి గాని రెండు ఎకరాలు సినిమా ఎండ్ పాయింట్ చూస్తే.. సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది.

మంచి కథనే దర్శకుడు ఎంచుకున్నాడు. కానీ సినిమా మాత్రం కాస్త స్లోగా సాగుతుంది. ఇంకా కథ ముందుకు సాగట్లేదేంటి అనిపించేలా కొన్ని సీన్లలో అనిపిస్తుంది. కామెడీ పండించేందుకు ట్రై చేశారు కానీ.. కొన్ని సీన్లలో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకాస్త కామెడీ మిక్స్ చేస్తే.. ఇంకా సినిమా బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ కూడా ప్రధానం బలం. ఇంకాస్త మ్యూజిక్ మీద ఫోకస్ చేస్తే బాగుండేది. కొన్ని సీన్లు స్లోగా వెళ్తాయి.

IPL_Entry_Point

టాపిక్