Pushpa 2: మీడియా ముందుకు రానున్న పుష్ప 2 టీమ్.. డేట్ ఇదే! ఆ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారా?
Pushpa 2 The Rule: పుష్ప 2 మూవీ టీమ్ మీడియా ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రెస్‍మీట్ డేట్ కూడా ఖరారైందని సమాచారం బయటికి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో కీలక ప్రకటన వస్తుందని బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇవే..
మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ముందు వరుసలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతలా ఈ సీక్వెల్ మూవీకి హైప్ ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ యాక్షన్ మూవీగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరింది. ఈ తరుణంలో మూవీ టీమ్ మీడియా సమావేశం నిర్వహించనుందని సమాచారం బయటికి వచ్చింది.
డేట్ ఇదే
‘పుష్ప 2: ది రూల్’ మూవీ టీమ్ మరో రెండు రోజుల్లో అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్‍లో ప్రెస్‍మీట్ నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం వెల్లడైంది. నిర్మాతలు, కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఈ మీట్‍కు హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
పుష్ప 2 మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకు సమీపించింది. ఇప్పటికే ఫస్టాఫ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా పూర్తయింది. చిత్రీకరణ కాస్త మాత్రమే మిగిలి ఉంది. అతిత్వరలో అది కూడా ఫినిష్ కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి.
ఒక రోజు ముందే రిలీజ్!
పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే వచ్చిన పోస్టర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, విడుదల తేదీని ఒక రోజు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్టు రూమర్లు ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకరోజు ముందుగానే ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే రూమర్లు గట్టిగానే ఉన్నాయి. మరి, మేకర్స్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్
పుష్ప 2 సినిమాకు ఏకంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్ల మార్క్ దాటిందనే సమాచారం బయటికి వచ్చింది. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, ఆడియో, శాటిలైట్ కలిపి ఈ చిత్రానికి రూ.1,065కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెజ్ జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంలో ఈ చిత్రం రికార్డు సృష్టించింది.
2021లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ స్వాగ్, స్టైల్, యాక్షన్, డ్యాన్స్ మేనరిజమ్‍లు.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. పుష్పకు ఎనలేని క్రేజ్ వచ్చింది. జాతీయ అవార్డును బన్నీ సొంతం చేసుకున్నారు. అందుకే ఆ మూవీకి సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. హైప్‍కు తగట్టే ఈ చిత్రాన్ని భారీతనంతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.