Pushpa 2 Shooting: పుష్ప 2 సినిమా షూటింగ్ మళ్లీ షురూ.. ఎప్పటి నుంచంటే!
Pushpa 2 Shooting Update: పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ షురూ అయ్యేందుకు రెడీ అయింది. కొన్ని రోజులుగా రూమర్లు విపరీతంగా వస్తున్న తరుణంలో చిత్రీకరణ ముందుకు సాగనుంది.
సినీ ప్రేక్షకులందరూ ఆసక్తి ఎదురుచూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ విషయంలో కొంతకాలంగా రూమర్లు విపరీతంగా వస్తున్నాయి. ఐకాన్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయనే, అందుకే షూటింగ్ ఆగిపోయిందనే పుకార్లు వచ్చాయి. ఈ కారణంగానే సుకుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయంలో అల్లు అర్జున్ యూరప్ ట్రిప్‍కు వెళ్లారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని మూవీ టీమ్ చెబుతోంది. ఈ తరుణంలో పుష్ప 2 చిత్రం షూటింగ్ మళ్లీ షురూ కానుంది.
రేపటి నుంచే.. అల్లు అర్జున్ లేని సీన్స్
‘పుష్ప 2: ది రూల్’ సినిమా షూటింగ్ రేపు (జూలై 23) మళ్లీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపటి నుంచి చిత్రీకరణ సాగనుంది. అల్లు అర్జున్ లేని సీన్లను షూటింగ్ సాగనుంది. దర్శకుడు సుకుమార్ ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. షూటింగ్ మళ్లీ షురూ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
పుష్ప 2 సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఓ స్పెషల్ సాంగ్‍తో పాటు కొన్ని ఫైట్ సీన్లు మిగిలి ఉన్నాయని సమచారం. మరికొన్ని రీషూట్లు కూడా ఉన్నాయట. ట్రిప్ నుంచి వచ్చాక అల్లు అర్జున్ షూటింగ్‍లో పాల్గొననున్నారు.
మళ్లీ వాయిదా పుకార్లు
ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా ఆలస్యమైంది. ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. అయితే, ఇటీవల షూటింగ్ నిలిచిపోవడంతో ఆ తేదీకి కూడా పుష్ప 2 రాదనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, డిసెంబర్ 6కు ఈ సినిమా రావడం పక్కా అంటూ మూవీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
రూమర్లు వచ్చింది ఇందుకే..
పుష్ప 2 షూటింగ్ ఆలస్యమవుతున్న విషయంలో దర్శకుడు సుకుమార్‌పై అల్లు అర్జున్ గుర్రుగా ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. అలాగే, సుకుమార్ సడెన్‍గా అమెరికా వెళ్లడంపై కూడా అసంతృప్తి చెందినట్టు గుసగుసలు వినిపించాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లారు. దీంతో సుకుమార్‌పై కోపంతోనే ఆయన గడ్డం తిసేసి.. వెకేషన్‍కు వెళ్లారనే రూమర్లు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే పుకార్లు ఎక్కువయ్యాయి.
అయితే, అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిర్మాత బన్నీవాసు ఇటీవల స్పష్టం చేశారు. అల్లు అర్జున్ షూటింగ్ పోర్షన్ నెలన్నర తర్వాత ఉంటుందని అందుకే ఆయన వెకేషన్‍కు వెళ్లారని, అప్పటిలోగా గడ్డం పెంచుతారని చెప్పారు. దీంతో ఊహాగానాలు కాస్త తగ్గాయి. అయితే, వాయిదా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులతో గ్రాండ్‍గా ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, రావు రామేశ్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
టాపిక్