Pushpa 2 The Rule Release date: ‘పుష్ప 2’ గురించి బిగ్గెస్ట్ అప్‍డేట్.. రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్ర యూనిట్
Pushpa 2 The Rule Release date: పుష్ప 2: ది రూల్ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి.
Pushpa 2 The Rule Release date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉంది. 2021లో ‘పుష్ప 1: ది రైజ్’ పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశమంతా బంపర్ హిట్ కొట్టింది పుష్ప. దీంతో ఈ మూవీకి సీక్వెల్‍గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’పై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. ఈ సినిమా గురించి అప్‍డేట్లు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2: ది రూల్ సినిమా గురించి నేడు (సెప్టెంబర్ 11) బిగ్ అప్‍డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమా రిలీజ్ డేట్‍ను అధికారికంగా ప్రకటించింది.
పుష్ప 2: ది రూల్ సినిమాను వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే వచ్చే సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీమేకర్స్ వెల్లడించింది. “ఈ డేట్‍ను గుర్తు పెట్టుకోండి. 2024 ఆగస్టు 15న పుష్ప 2: దిరూల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్‍ను ఏలేందుకు పుష్ప రాజ్ మళ్లీ వచ్చేస్తున్నాడు” అని ట్వీట్ చేసింది. చాలా ఉంగరాలు, బ్రాస్‍లైట్లు ధరించిన అల్లు అర్జున్ చేతికి రక్తం మరకలు అంటిన పోస్టర్‌ను రివీల్ చేసింది.
పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ చిత్రాన్ని మరిన్ని జాగ్రత్తలు తీసుకొని, మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇటీవల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. దీంతో ఎంత భారీ స్థాయిలో ఈ మూవీ రానుందో అర్థమవుతోంది. పుష్ప 1 చిత్రంలో అల్లు అర్జున్ స్టైల్, యాక్షన్, మేనరిజమ్స్ ప్రపంచాన్ని ఊపేశాయి. ఈ పుష్ప 2: దిరూల్ చిత్రం కూడా అదే రీతిలో మరింత గ్రాండ్‍గా ఉండే ఛాన్స్ ఉంది. గంధపు చెక్కల సిండికేట్‍కు లీడర్‌గా రూల్ చేయనున్నాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్).
పుష్ప 2: ది రూల్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.