Pushpa 2 The Rise: రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై 11 రోజుల్లోనే రూ.700కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తాచాటుతోంది. అయితే, యానిమల్ చిత్రంపై విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి. ఈ చిత్రంలో హింస మరీ తీవ్రంగా, సమాజంపై దుష్ప్రభావం చూపేలా ఉందనే విమర్శలు భారీగా వస్తున్నాయి. కొందరు ప్రముఖులతో పాటు చాలా మంది నెటిజన్లు కూడా యానిమల్ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా స్క్రిప్ట్‌లో మేకర్స్ స్వల్ప మార్పులు చేస్తున్నట్టు బజ్ బయటికి వచ్చింది. వివరాలివే..
పుష్ప 2 సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయిన పుష్ప: ది రైజ్‍కు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ షూటింగ్ జోరుగా జరుగుతోంది. అయితే, యానిమల్ సినిమాపై విమర్శలు భారీగా వస్తుండటంతో ‘పుష్ప 2’లో కొన్ని మార్పులను దర్శకుడు సుకుమార్ చేయనున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
పుష్ప 2 చిత్రంలో హింసను కాస్త తగ్గించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారట. యాక్షన్ సీన్లలో వైలెన్స్ ఓవర్ డోస్ కాకుండా చూసుకోవాలని స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మితిమీరిన హింస విషయంలో యానిమల్‍పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పుష్ప 2లో మార్పులు చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా కన్ఫర్మేషన్ రాలేదు.
మరోవైపు, పుష్ప 2 సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న సీన్లను కూడా పెంచాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారని టాక్. యానిమల్‍లో రష్మిక నటనకు ప్రశంసలు వస్తుండటం, ఆమె పాపులారిటీ పెరగడంతో పుష్ప 2లో ఆమె స్క్రీన్ టైమ్ పెంచాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
పుష్ప 2 సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సంబంధిత కథనం