Pushpa 2: హైదరాబాద్‌లో పార్టీ చేసుకున్న పుష్ప 2 యూనిట్.. కానీ ఇద్దరు మిస్సింగ్
Pushpa 2 team party: పుష్ప 2 మూవీ గత ఆరు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ పాత కలెక్షన్ల రికార్డులను చెరిపేస్తూ. . అందర్నీ ఆశ్చర్యపరిచేలా వసూళ్లను రాబడుతోంది. దాంతో..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న రిలీజైన పుష్ప 2 మూవీ.. ఐదు రోజుల్లోనే రూ.800 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. దాంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పార్టీ చేసుకుంది. అయితే.. పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఇద్దరు మాత్రం ఈ పార్టీలో కనిపించలేదు.
పార్టీ ఉంది పుష్పా.. కానీ?
పుష్ప 1లో పార్టీ లేదా పుష్పా? అంటూ టీజ్ చేసిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్).. పుష్ప 2లోనూ కనిపించారు. పుష్ప 1తో పోలిస్తే.. పుష్ప 2లోనే ఫహాద్ ఫాజిల్ ఎక్కువసేపు తెరపై కనిపించారు. కానీ.. అతని క్యారెక్టర్ మాత్రం చాలా సిల్లీగా చూపించడంతో ఫహాద్ ఫాజిల్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఎక్కడా ఫహాద్ ఫాజిల్ కనిపించలేదు. చివరికి చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీలో కూడా ఈ మలయాళం హీరో కనబడలేదు.
పార్టీలో కనిపించని శ్రీవల్లి
పుష్ప 2లో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిగా నటించగా రష్మిక మంధాన కూడా సక్సెస్ పార్టీలో కనిపించలేదు. దాదాపు ఐదేళ్లు పుష్ప టీమ్‌తో జర్నీ చేసిన రష్మిక.. పుష్ప 1తోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప 2లో అందం, అభినయంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప 2 ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్న రష్మిక మంధాన.. సక్సెస్ పార్టీలో లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆరు భాషల్లో పుష్ప2 జోరు
పుష్ప 2 సక్సెస్ పార్టీకి హీరో అల్లు అర్జున్‌తో పాటు మూవీలో కిస్సిక్ ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ తదితరులు హాజరయ్యారు. వరల్డ్‌వైడ్‌గా పుష్ప 2 మూవీ 12,500 స్క్రీన్లలో విడుదల అవగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ భాషల్లోనూ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. తెలుగు కంటే హిందీలోనే పుష్ప2కి కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.