Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్ వాయిదా ఖాయమే.. అల్లు అర్జున్ టీమ్ చెప్పేసింది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Pushpa 2 Release: పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడుతుందా? లేదా అనుకున్న సమయానికే వస్తుందా? దీనిపై మేకర్స్ స్పష్టత ఇవ్వకపోయినా అల్లు అర్జున్ టీమ్ మెంబర్ మాత్రం వాయిదా ఖాయమే అన్న హింట్ ఇచ్చాడు.
Pushpa 2 Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రావడం లేదని స్పష్టమవుతోంది. రిలీజ్ వాయిదాపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. మేకర్స్ మాత్రం స్పందించడం లేదు. పైగా తాము చేసే ప్రతి పోస్టులోనూ అదే రోజు రిలీజ్ అవుతుందని చెబుతూ వస్తోంది. కానీ తాజాగా అల్లు అర్జున్ టీమ్ సభ్యుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా ఖాయమే అని తేల్చేశాడు.
పుష్ప 2 రిలీజ్ వాయిదా పడినట్లేనా?
పుష్ప 2 అందరూ అనుకుంటున్నట్లు ఆగస్ట్ 15న రిలీజ్ కావడం లేదని, వాయిదా పడుతోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఈ వాయిదా పుకార్లపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. అతని కంటెంట్ హెడ్, మీడియా స్ట్రేటజిస్ట్ అయిన శరత్ చంద్ర నాయుడు ఓ ట్వీట్ లో పుష్ప 2 రిలీజ్ వాయిదా ఖాయమనే హింట్ ఇచ్చాడు.
అంతకుముందు శరత్ చంద్రను ట్యాగ్ చేస్తూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. "ఒక్క ట్వీట్ మా మొహాన పడేయ్ అన్నా పోస్ట్ పోన్ అవ్వట్లేదు అని" అంటూ ఆ అభిమాని అడిగాడు. దీనికి అతడు స్పందిస్తూ.. "చెయ్యలేను ఎందుకంటే అవుతుంది కాబట్టి" అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. అంటే పుష్ప 2 ఆగస్ట్ 15న రావడం లేదని శరత్ చంద్ర తేల్చేశాడు.
పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు?
పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం ఇంకా పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఐటెమ్ సాంగ్ షూటింగ్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15 డెడ్‌లైన్ కచ్చితంగా సాధ్యం కాదని తేలిపోయింది.
మరి కొత్త రిలీజ్ డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. దీనిపై మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆగస్ట్ 15నే పూరి జగన్నాథ్, రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతుందని ఈ మధ్యే అనౌన్స్ చేసినప్పుడే పుష్ప 2 వాయిదా ఖాయమన్న అంచనాకు అభిమానులు వచ్చేశారు. ఆరు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అన్న ఆతృత అభిమానుల్లో కనిపిస్తోంది.
వాయిదా ఖాయమని శరత్ చంద్ర హింట్ ఇవ్వడంతోనే ఫ్యాన్స్ లో ఒకరకమైన అసహనం మొదలైంది. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలని వాళ్లు నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ ఎన్ని పుకార్లు వచ్చినా.. మేకర్స్ సైలెంట్ గా ఉండటంతో ఆగస్ట్ 15నే ఖాయం అనుకున్న వాళ్లకు తాజాగా అప్డేట్ మింగుడు పడటం లేదు.
ఎప్పుడో డిసెంబర్, 2021లో పుష్ప రిలీజైంది. అప్పటి నుంచి అల్లు అర్జున్ మరో మూవీ చేయలేదు. సుకుమార్ తో కలిసి అతడు కూడా ఈ సీక్వెల్ పైనే పని చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ వస్తే మూడేళ్లు పూర్తవుతుంది. ఇన్నేళ్లుగా తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూడలేకపోయామన్న బాధ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.
టాపిక్