Pushpa 2 Release Date: పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడుతుందా? ఆగస్ట్ 15న ఆ మూవీ రావడం లేదా? కొన్ని రోజులుగా ఈ వార్తలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిజానికి వాయిదా వార్తలు ఇదే తొలిసారి కాదు. అయితే తాజాగా మేకర్స్ మరోసారి తమ మూవీ అదే రోజున వస్తుందని స్పష్టం చేశారు. సెకండ్ సింగిల్ సూసేకి సాంగ్ రీల్స్ రూపంలో క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి చెబుతూ రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేశారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని ఇప్పటికి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ప్రతిసారి మేకర్స్ ప్రత్యేకంగా ఈ పుకార్లను కొట్టేయకుండా.. ఏదో ఒక విధంగా రిలీజ్ డేట్ అదే అని కన్ఫమ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి వాయిదా పుకార్ల నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకి సాంగ్ రీల్స్ విషయంలో క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి చేసిన పోస్ట్ అది. 1.5 మిలియన్ రీల్స్, షార్ట్స్ తో పుష్ప 2 సెకండ్ సింగిల్ దూసుకెళ్తోంది అంటూ మేకర్స్ ఈ పోస్ట్ చేశారు. అందులో పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15నే అని మరోసారి స్పష్టంగా చెప్పారు. ఇకనైనా రిలీజ్ వాయిదా వార్తలకు తెరదించాలన్నట్లుగా పరోక్షంగా వాళ్లు చెప్పడం గమనార్హం.
ఇది అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదే రోజు డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కానుండటంతో పుష్ప 2 రిలీజ్ వాయిదా పడినట్లే అని శనివారం (జూన్ 15) వరకు కూడా అభిమానులు భావించారు. కానీ మేకర్స్ మరోసారి స్పష్టం చేయడంతో ఇక ఈ సీక్వెల్ వాయిదా పడే ప్రసక్తే లేదని ఫ్యాన్స్ భరోసాతో ఉన్నారు. అంతేకాదు మూవీ ప్రమోషన్లు జోరు కూడా పెంచనున్నారు. ఇందులో భాగంగా గ్రాండ్ గా ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.
పుష్ప 2 నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ సూసేకి పాట సంచలనం సృష్టిస్తోంది. ఈ కపుల్ సాంగ్ తెలుగు ప్రేక్షకులనే కాదు వివిధ భాషల ప్రేక్షకులను కూడా స్టెప్పులేసేలా చేస్తోంది. ఈ సాంగ్ పై రీల్స్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 15 లక్షలకుపైగా రీల్స్, షార్ట్స్ క్రియేట్ చేశారంటే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
అంతకుముందు పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగిన ఫస్ట్ సింగిల్ కూడా హిట్ కొట్టింది. పుష్ప సూపర్ హిట్ అవడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి పార్ట్ మ్యూజికల్ గానూ సక్సెసైంది. ఇప్పుడు సీక్వెల్ నుంచి వచ్చిన రెండు పాటలూ అదే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.