Pushpa 2 Release Date: తగ్గేదేలే.. పుష్ప 2 రిలీజ్ డేట్ మరోసారి కన్ఫమ్ చేసిన టీమ్
Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ పై వెనక్కి తగ్గేదే లే అంటోంది ఆ మూవీ టీమ్. శుక్రవారం (జనవరి 26) మరోసారి రిలీజ్ డేట్ ను ఆ టీమ్ కన్ఫమ్ చేయడం విశేషం.

Pushpa 2 Release Date: పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడనుందా? ఈ మూవీ ముందుగా చెప్పిన దాని ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ కాదా? కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ సందేహాలకు మూవీ టీమ్ తెర దించింది. పుష్ప ది రూల్ ఆగస్ట్ 15నే రాబోతోందని మరోసారి కన్ఫమ్ చేసింది.
శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా పుష్ప అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ డేట్ అదే అని టీమ్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ డైలాగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
నడుస్తోంది పుష్ప రూలే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ 2020, డిసెంబర్ 26న రిలీజైంది. ఈ మూవీ తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. నార్త్ లో మాత్రం దుమ్మురేపింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచీ పుష్ప సీక్వెల్ పై పాన్ ఇండియా అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
కేజీఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్ తర్వాత పుష్ప 2పై అంచనాలు మరింత పెరగడంతో సుకుమార్ ఇంకా జాగ్రత్తగా మూవీని షూట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ లోనూ మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. భారీగా రీషూట్ల మీద రీషూట్లు చేస్తుండటంతో బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. మొత్తానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేస్తామని గతేడాదే మేకర్స్ వెల్లడించారు.
అయితే ఈ మధ్య కాలంలో పుష్ప 2 రిలీజ్ వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ మూవీ షూటింగ్ కేవలం 50 శాతమే పూర్తవడంతో ఆగస్ట్ 15 డెడ్ లైన్ అందుకోవడం కష్టమని అన్నారు. మేలోగా మొత్తం షూటింగ్ పూర్తి చేసి తర్వాత ప్రమోషన్లు మొదలు పెట్టాలని టీమ్ భావించినా.. అది సాధ్యమయ్యేలా లేదని వార్తలు వచ్చాయి.
అయితే వాటన్నింటికీ పుష్ప టీమ్ మరోసారి చెక్ పెట్టింది. ఆగస్ట్ 15నే కచ్చితంగా వస్తున్నామని స్పష్టం చేసింది. నిజానికి ఈ పుష్ప 2 విషయంలో డైరెక్టర్ సుకుమార్ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని అనుకుంటున్నాడు. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో అందుకు తగిట్లే ప్రతి సీన్ ఉండాలని ఆరాట పడుతున్నాడు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ డేట్ అదే అని టీమ్ కచ్చితంగా చెప్పడం సుకుమార్ పై మరింత ఒత్తిడి పెంచేదే. మరి అతడు అనుకున్నలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. తర్వాత పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్లు నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. మరోవైపు అదే ఆగస్ట్ 15నాడు బాలీవుడ్ లో అజయ్ దేవ్‌గన్ నటిస్తున్న సింగం అగైన్ మూవీ రిలీజ్ కానుంది.
ఇక పుష్ప ది రూల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఈ మధ్య తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. థియేటర్లలో రిలీజైన తర్వాత సుమారు 45 నుంచి 60 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.