Pushpa 2 Box Office Collection: 21 రోజుల్లో రూ.1705 కోట్లు.. తిరుగులేని పుష్ప 2.. డేంజర్లో బాహుబలి 2 రికార్డు
Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్యంత వేగంగా రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
Pushpa 2 Box Office Collection: అల్లు అర్జున్ ఓవైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన కేసు ఎదుర్కొంటూనే ఉండగా.. అతని సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూనే వెళ్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. డిసెంబర్ 25నాటికి 21 రోజుల్లోనే రూ.1700 కోట్ల మార్క్ దాటింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది.
పుష్ప 2.. 21 రోజుల్లో రూ.1705 కోట్లు
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర అసలు బ్రేకులు లేని బండిలా దూసుకెళ్తోంది. ఈ సినిమా 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ గురువారం (డిసెంబర్ 26) తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ప్రభాస్ బాహుబలి 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్ల రికార్డుకు పుష్ప 2 మరింత చేరువైంది.
"2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూనే ఉంది. పుష్ప 2 ది రూల్ రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లు వచ్చాయి" అని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. మరోవైపు బాహుబలి 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1788 కోట్లు వసూలు చేసింది. అతి త్వరలోనే పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే జరిగితే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో రెండో స్థానానికి దూసుకెళ్తుంది. దంగల్ మాత్రం ఇప్పటి వరకూ రూ.2 వేల కోట్లకుపైగా వసూలు చేసిన ఏకైక ఇండియన్ మూవీగా ఉంది. ఆ రికార్డును కూడా లాంగ్ రన్ లో పుష్ప 2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
అల్లు అర్జున్ కేసు
పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ కేసు ఇంకా వీడలేదు. ఈ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి మొదట రూ.25 లక్షలు అనౌన్స్ చేసిన అతడు.. తాజాగా మరో రూ.75 లక్షలు కలిపి రూ.కోటి ఇస్తున్నట్లు చెప్పాడు. అటు మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, సుకుమార్ మరో రూ.50 లక్షలు ఇవ్వడంతో మొత్తంగా రూ.2 కోట్లు అందినట్లయింది.
ఇక ఈ ఇష్యూ తీవ్రం కావడంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు గురువారం (డిసెంబర్ 26) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో వాళ్లు రేవంత్ తో భేటీ అయ్యారు. నాగార్జున, వెంకటేష్, త్రివిక్రమ్, కొరటాల శివలాంటి సినీ ప్రముఖులు సమావేశానికి వెళ్లగా.. చిరంజీవి మాత్రం రాలేదు.