Pushpa 2 Box Office: పుష్ప 2 బాక్సాఫీస్.. తమిళనాడులో బ్లాక్‌బస్టర్.. కానీ బన్నీకి వీరాభిమానులున్న అక్కడ మాత్రం..
Pushpa 2 Box Office: పుష్ప 2 మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. కేవలం రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్ అందుకుంది. తమిళనాడులో వసూళ్ల రికార్డులు తిరగరాయగా.. అల్లు అర్జున్ కు వీరాభిమానులున్న కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
Pushpa 2 Box Office: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తెలుగుతోపాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా తమిళనాడులో బన్నీ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు డబ్బింగ్ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఆ రాష్ట్రంలో రూ.11 కోట్ల ఓపెనింగ్ సాధించింది. అయితే కేరళలో మాత్రం రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
పుష్ప 2 తమిళనాడులో అలా.. కేరళలో ఇలా..
పుష్ప 2 మూవీ తమిళనాడులో రికార్డులు తిరగరాస్తోంది. గురువారం (డిసెంబర్ 5) మూవీ రిలీజ్ కాగా.. ఏకంగా రూ.11 కోట్లు రాబట్టింది. ఇది ఏ తెలుగు డబ్బింగ్ సినిమాకైనా అత్యధిక వసూళ్లు కావడం విశేషం. అంతెందుకు సూర్య కంగువ కంటే కూడా ఇదే ఎక్కువంటే నమ్మశక్యం కాదు. ఇక రెండో రోజు కూడా రూ.8 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే తమిళనాడులో మొత్తంగా రూ.19 కోట్లు వచ్చాయి. సాధారణంగా తమిళనాడులో ఓ తెలుగు డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం అత్యంత అరుదు. ఆ లెక్కన అల్లు అర్జున్ పుష్ప 2 అరుదైన ఘనతను సొంతం చేసుకుందని చెప్పాలి.
ఇక కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సౌత్ లో తెలుగు రాష్ట్రాల తర్వాత అల్లు అర్జున్ కు అత్యధిక మంది అభిమానులు ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడ సాధారణంగా పుష్ప 2 మూవీకి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని భావించారు. కానీ రెండు రోజులు కలిపి రూ.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మూవీ ఎందుకో మలయాళ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మూడో రోజు ఈ వసూళ్లు మరింత పడిపోనున్నట్లు ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.
హిందీ మార్కెట్లోనే అత్యధికం
పుష్ప 2 మూవీకి ఊహించినట్లే నార్త్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల్లో తెలుగు కంటే ఎక్కువగా హిందీ వసూళ్లే ఉన్నాయి. హిందీ వెర్షన్ కు రూ.127 కోట్లు రాగా.. తెలుగు వెర్షన్ కు రూ.120 కోట్లు వచ్చాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు రూ.321 కోట్లు కాగా.. ఓవర్సీస్ లో రూ.100 కోట్లు దాటాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు భారీగా పెరగడం కూడా కలెక్షన్లు తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. దీంతో మేకర్స్ టికెట్ల ధరలు తగ్గించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల్లోనే పుష్ప 2 మూవీ మూడేళ్ల కిందట వచ్చిన పుష్ప 1 లైఫ్ టైమ్ వసూళ్లను మించిపోవడం విశేషం. ఈ జోరు చూస్తుంటే.. రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద కష్టమైన పనిలా ఏమీ కనిపించడం లేదు.