Double Ismart: రామ్ - పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ కీలక అప్‍డేట్ రేపే: టైమ్ ఫిక్స్
Double Ismart Update: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి కీలక అప్‍డేట్ వెల్లడించేందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెడీ అయ్యాడు. అప్‍డేట్‍కు డేట్, టైమ్ ఫిక్స్ చేశాడు.
Double Ismart Update: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‍లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బ్లాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు ఎక్కువగా లవర్ బాయ్ సినిమాలు చేసిన రామ్‍లో ఊరమాస్ యాంగిల్‍ను ఇస్మార్ట్ శంకర్ ద్వారా పూరీ బయటికి తీసుకొచ్చాడు. కాగా, ఇప్పుడు రామ్ - పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ చేయనున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్‍తో ఈ సినిమా రానుంది. రేపు (జూలై 10) ఈ సినిమాకు సంబంధించిన స్ట్రైకింగ్ అప్‍డేట్ ఇస్తామంటూ నేడు ట్వీట్ చేశాడు పూరీ జగన్నాథ్.
'డబుల్ ఇస్మార్ట్' పోస్టర్‌ను పూరీ జగన్నాథ్ నేడు ట్వీట్ చేశాడు. రేపు (జూలై 10 ) ఉదయం 11 గంటల 11 నిమిషాలకు భారీ అప్‍డేట్ ఇస్తామని చెప్పాడు. ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో మాస్ యాక్షన్ చిత్రంగా ఇది ఉండే ఛాన్స్ ఉంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ వస్తుందని పోస్టర్‌లో స్పష్టం చేశాడు పూరీ.
“ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్. ఈసారి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు డబుల్ ఇస్మార్ట్ స్ట్రైకింగ్ అప్‍డేట్” అని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశాడు. పూరీ పోస్ట్ చేసిన ఈ పోస్టర్‌లో త్రిశూలం దానిపై రక్తం, రుద్రాక్ష, ఢమరుకం ఉండగా.. బ్యాక్‍గ్రౌండ్‍లో మంటలు, మరిన్ని త్రిశూలాలు ఉన్నాయి. మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ కడా మాస్ యాక్షన్ మూవీగానే ఉండనుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని ప్రస్తుతం స్కంద మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఇప్పటికే స్కంద షూటింగ్ పూర్తయింది. దీంతో అతిత్వరలోనే రామ్ - పూరీ సినిమా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. మరి రేపు పూరీ ఏ అప్‍డేట్ ఇస్తాడో చూడాలి.
విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా గతేడాది భారీ పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్‍లో విడుదలై చతికిలపడింది. నిర్మాతగానూ పూరీ, చార్మీకి నష్టాలను మిగిల్చింది. మరోవైపు, ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన రెడ్, వారియర్ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా రామ్, పూరీ జగన్నాథ్ ఇద్దరికీ అత్యంత కీలకంగా మారింది.