Double iSmart vs Mr Bachchan: రవితేజ ప్రస్తావన లేకుండానే పూరి జగన్నాథ్ ‘ఏవీ’.. గ్యాప్ అంతలా వచ్చేసిందా!
Puri Jagannath - Ravi Teja: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏవీని నిర్వాహకులు ప్రదర్శించారు. అయితే, దీంట్లో రవితేజతో చేసిన సినిమాల ప్రస్తావన కూడా లేకపోవడం హాట్‍టాపిక్‍గా మారింది. బాక్సాఫీస్ పోటీ ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చినట్టు కనిపిస్తోంది.
మాస్ మహారాజ రవితేజ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో క్రేజీ సినిమాలు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఏకంగా ఐదు సినిమాలు చేశారు. అందులో మూడు బ్లాక్‍బస్టర్ అయ్యాయి. రవితేజ, పూరి కాంబినేషన్‍లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు తెరకెక్కాయి. ఇందులో మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కెరీర్ ఆరంభంలో ఇద్దరూ నిలదొక్కుకునేందుకు ఈ సినిమాలు ఊతమిచ్చాయి. అయితే, తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినీ ప్రస్థానం గురించి ఏవీ (ఆడియో, వీడియో) ప్రదర్శితమైంది. ఇందులో అసలు రవితేజతో చేసిన సినిమాల ప్రస్తావన లేకపోవడం హాట్‍టాపిక్‍గా అయింది.
బాక్సాఫీస్ పోటీతో కోపంగా పూరి!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. విడుదల తేదీని చాలా రోజుల కిందటే పూరి ఫిక్స్ చేశారు. లైగర్‌తో ఎదురుదెబ్బ తిన్న ఆయనకు డబుల్ ఇస్మార్ట్ చాలా ముఖ్యంగా మారింది. అయితే, ఆగస్టు 15 పోటీకి అనూహ్యంగా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా వచ్చింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రావడం పూరి జగన్నాథ్‍కు కోపం తెప్పించిందనే టాక్ నడుస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా ఆదివారం (ఆగస్టు 4) జరిగిన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో చూపిన పూరి జగన్నాథ్ ఏవీలో రవితేజ ప్రస్తావన లేకపోయింది. పూరి పని చేసిన దాదాపు అందరు హీరోలు ఆ ఏవీలో ఉండగా.. ఆయనతో ఐదు సినిమాలు చేసిన రవితేజ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ పూరి జగన్నాథ్, రవితేజ మధ్య గ్యాప్ తెచ్చినట్టు కనిపిస్తోంది. తన సినీ కెరీర్లో ఎంతో కీలకంగా నిలిచిన రవితేజ పేరు కనీసం పూరి జగన్నాథ్ ఏవీలో ఒక్కసారి కూడా లేకపోవడం సినీ సర్కిల్‍లో హాట్ టాపిక్‍గా మారింది.
ముందు చార్మీ..
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరితో కలిసి నిర్మిస్తున్న చార్మీ కౌర్ ఇటీవల మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో అన్‍ఫాల్ చేశారు. దీంతో మిస్టర్ బచ్చన్ టీమ్‍పై ఇస్మార్ట్ యూనిట్ అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టమైంది. ఈ విషయంపై మిస్టర్ బచ్చన్ టీజర్ లాంజ్ ఈవెంట్‍లో హరీశ్ శంకర్ స్పందించారు. ఆర్థిక పరమైన విషయాలు, ఓటీటీ డీల్ కారణంగానే ఆగస్టు 15కే రాక తప్పడం లేదని వివరణ ఇచ్చారు. పూరి జగన్నాథ్ తనకు గురువు లాంటి వారని ఆయనతో తాను పోటీ పడడం లేదని, తప్పకనే ఆ రోజున తమ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి వస్తోందని వివరించారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని 1980ల బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కించారు హరీశ్. ఇండిపెండెన్స్ డే రోజున ఈ బాక్సాఫీస్ పోటీలో ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి.