Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'
Project Z OTT Release: ప్రాజెక్ట్ జెడ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఈ తమిళ డబ్బింగ్ చిత్రం అందుబాటులోకి వస్తోంది. సందీప్ కిషన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు.
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా ప్రశంసలు పొందుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ మూవీస్ చేస్తున్నారు. ప్రస్థానం చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన సందీప్ సుమారు 14ఏళ్లు నటుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం మంచి హిట్ అయింది. కాగా, 2017లో తమిళంలో మాయావన్ (Maayavan) పేరుతో ఓ చిత్రం చేశారు సందీప్. ఆ చిత్రం ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో తెలుగులో డబ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలో అడుగుపెడుతోంది.
ప్లాట్‍ఫామ్ ఇదే..
‘ప్రాజెక్ట్ జెడ్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో ఈ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. త్వరలోనే తేదీ ఫిక్స్ చేయనుంది.
మూవీ గురించి..
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీగా తమిళంలో ‘మాయావన్’ చిత్రం తెరకెక్కింది. 2017 డిసెంబర్‌లో విడుదలైంది. తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ పేరుతో వచ్చింది. ఈ మూవీలో సందీప్ కిషన్‍కు జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‍గా చేశారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ నటించారు.
ప్రాజెక్ట్ జెడ్ మూవీలో సందీప్, లావణ్యతో పాటు జాకీ ష్రాఫ్, డానియెల్ బాలాజీ, మైమ్ గోపీ, ఆమరేంద్రన్, భగవతి పెరుమాల్, జయప్రకాశ్, అక్షర గౌడ, కేఎస్ రవికుమార్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సీవీ కుమార్.. నిర్మాతగానూ వ్యవహించారు. తమిళంలో ఈ చిత్రానికి మోస్తరు వసూళ్లే వచ్చాయి.
మాయావన్ ఇప్పటికే ఓటీటీలో..
మాయావన్ సినిమా తమిళంలో ఇప్పటికే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రాజెక్ట్ జెడ్‍ను ఆహా ఓటీటీ ఇప్పుడు స్ట్రీమింగ్‍కు తీసుకురానుంది. దీంతో థియేటర్లలో విడుదలైన ఆరున్నేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
ఈ మూవీకి సీక్వెల్ కూడా..
2017లో వచ్చిన మాయావన్‍కు సీక్వెల్‍ను కూడా సందీప్ కిషన్ చేయనున్నారు. ‘మయా వన్’ (Maaya One) పేరుతో ఈ చిత్రం రానుంది. దర్శకుడు సీవీ కుమార్ ఇప్పటికే ఈ మూవీ పనులను కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముందుగా మాయావన్: రీలోడెడ్ అని ఈ సీక్వెల్ మూవీని ప్రకటించగా.. దాన్ని ‘మాయా వన్’గా మార్చారు. ఈ సీక్వెల్ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల వచ్చింది. ఈ లేటెస్ట్ మాయా వన్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది.
త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలోనూ ఈ సినిమాకు సందీప్ కిషన్ ఓకే చెప్పారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే షురు కానుందని తెలుస్తోంది. అలాగే, తమిళ హీరో ధనుష్ చేస్తున్న రాయన్ మూవీలోనూ సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ తర్వాత మరోసారి ధనుష్‍తో కలిసి నటిస్తున్నారు. రాయన్ చిత్రానికి ధనుషే దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వరుస చిత్రాలతో సందీప్ బిజీగా ఉన్నారు. ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.