Hanuman 50 Days: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అద్భుతమైన చిత్రాలు.. నిర్మాత కన్ఫర్మ్
Prasanth Varma Cinematic Universe Movies: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా ఈ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలపై నిర్మాత నిరంజన్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు.
Hanuman Historic 50 Days Celebrations: యంగ్ హీరో తేజ సజ్జా హనుమంతుగా నటించిన సినిమా హనుమాన్. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలతో కలిసి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ భారీ విజయం అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హనుమాన్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మొదట చిన్న సినిమాగా స్టార్ట్ అయి అనంతరం పాన్ వరల్డ్ మూవీగా అవతరించి రిలీజైన హనుమాన్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. దాంతో రూ. 350 కోట్ల వరకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించుకుంది. అంతేకాకుండా 150 థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ యూనిటర్ హనుమాన్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. అలాగే ఈ వేడుకలో చిత్ర యూనిట్‌కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్.
హనుమాన్ 50 రోజుల వేడుకల్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి భవిష్యత్తులో రాబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నిరంజన్ రెడ్డి. "చాలా రోజుల తర్వాత 50 రోజుల పండగ హనుమాన్ సినిమాతో జరుపుకోవడం చాలా అనందంగా ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక శాతం మాత్రమే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి" అని ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు.
"మా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేసింది. తేజ సజ్జా చాలా నమ్మకంతో అంకిత భావంతో సినిమా చేశారు. మా సినిమాలో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడటం అంటే మాములు విషయం కాదు. మా డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యుటర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. మా నుంచి రానున్న సినిమాలని కూడా ఇదే ప్యాషన్‌తో చేస్తాం" నిరంజన్ రెడ్డి అన్నారు.
"మా నుంచి రానున్న సినిమాలపై కూడా ప్రేక్షకులు ఇదే ఆదరణ చూపాలని కోరుకుంటున్నాం" అని హనుమాన్ నిర్మాత కె నిరంజన్ రెడ్డి కోరారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో తేజ సజ్జా కూడా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
"ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకుల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యపడింది. సినిమా గురించి చాలా వేదికల్లో మాట్లాడను. ఇప్పుడు సినిమా మీ ముందు ఉంది కాబట్టి ఇకపై మీరు ముందుకు తీసుకెళ్తారు. అది చాలు మాకు. మమ్మల్ని నమ్మి, ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు'' అని హీరో తేజ సజ్జా తెలిపాడు.