Dil Raju Adhi Dha Saaru Song: దిల్ రాజు ట్రోలింగ్ డైలాగ్‌తో లిరికల్ సాంగ్ అది దా సారు- స్వయంగా తానే రిలీజ్ చేసిన నిర్మాత
Dil Raju Released Adhi Dha Saaru Song: నిర్మాత దిల్ రాజు చెప్పిన అది దా సారు డైలాగ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. తాజాగా అదే టైటిల్‌తో ఉన్న సాంగ్‌ను స్వయంగా దిల్ రాజే రిలీజ్ చేశారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా చేస్తున్న సఃకుటుంబానాం మూవీలోని అది దా సారు పాటను విడుదల చేశారు.
Dil Raju Released Adhi Dha Saaru Song: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు పేరు తెచ్చుకున్నారు. తెలుగుతోపాటు తమిళ చిత్రాలను కూడా ఆయన నిర్మించారి. ఈ క్రమంలోనే విజయ్ దళపతితో వారసుడు (తమిళంలో వారిసు) మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
తమిళం మిక్స్ చేసి
రిలీజ్‌కు ముందు తమిళనాడులో జరిగిన వారిసు ఈవెంట్‌లో హీరో దళపతి విజయ్‌ను పొగుడుతూ "ఒరు కాఫీ కప్, అది దా సారు" అని దిల్ రాజు తమిళం మిక్స్ చేసి స్పీచ్ ఇచ్చారు. దాంతో ఆయన చెప్పిన డైలాగ్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. అంతేకాకుండా చాలా ఫన్నీగా మీమ్స్ కూడా పడ్డాయి.
డిఫరెంట్ టైటిల్
అయితే, ఇప్పుడు అదే డైలాగ్‌తో ఓ పాట వస్తోంది. అంతేకాకుండా ఆ సాంగ్‌ను ఆ డైలాగ్స్ చెప్పిన దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేయడం విశేషంగా మారింది. దీన్ని బట్టి దిల్ రాజు తనపై వచ్చిన మీమ్స్, ట్రోలింగ్‌ను ఎంత స్పోర్టివ్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హీరోయిన్ మేఘా ఆకాష్ తాజాగా డిఫరెంట్ టైటిల్‌లో నటించిన సినిమా సఃకుటుంబానాం.
గతేడాదే ప్రారంభం
హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రారంభం అయ్యాయి. ఇందులో రామ్ కిరణ్ హీరోగా చేస్తున్నాడు. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకుడిగా పనిచేస్తున్నారు.
అది దా సారు సాంగ్ రిలీజ్
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న సఃకుటుంబానాం సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి "అది దా సారు" లిరికల్ సాంగ్‌ను దిల్ రాజు చేతులమీదుగా విడుదల చేశారు. సామాన్య అంశాలను జోడిస్తూ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.
ఆకట్టుకునేలా లిరిక్స్
"అది దా సారు"అంటూ సాగిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా సినిమాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మేఘా ఆకాష్ లుక్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే వైరల్ అవుతూ ఉండగా ఇప్పుడు లిరికల్ సాంగ్ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది.
భాను మాస్టర్ కొరియోగ్రఫీ
ఈ పాట ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. ఈ పాటకి భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ట్యూన్‌కి బీట్‌కి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. భాను మాస్టర్‌కి ఈ సాంగ్ మంచి పేరు తీసుకొస్తుందని వారు ఆశిస్తున్నారు. దీంతో కుటుంబం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
ఇతర కీలక పాత్రలు
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్స్‌గా నటించి సఃకుటుంబనాం సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, నవీన్ జీపీ, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం, తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.