Bellamkonda Suresh: 25 ఏళ్లలో 38 సినిమాలు.. శ్రీహరితో సక్సెస్ మొదలు.. ఆయన లేకపోవడం బాధాకరం: నిర్మాత బెల్లంకొండ సురేష్
Producer Bellamkonda Suresh Film Journey: తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పేరొందిన బెల్లంకొండ సురేష్ సినీ కెరీర్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయింది. డిసెంబర్ 5న 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ సురేష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. ఈ 25 ఏళ్లలో తాను 38 సినిమాలు చేసినట్లు తెలిపారు.
Producer Bellamkonda Suresh About Srihari: "నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్లు అయింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్‌ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015లో గంగ రిలీజై సూపర్ హిట్ అయింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్లీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాను" అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు బెల్లంకొండ సురేష్. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి బెల్లంకొండ సురేష్ పుట్టినరోజు ఇవాళ (డిసెంబర్ 5). 57 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విలేకరులు సమావేశంలో తన సినీ జర్నీ గురించి, చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి పలు విశేషాల్ని పంచుకున్నారు బెల్లంకొండ సురేష్.
నిర్మాతగా 25 ఏళ్ల జర్నీ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
- ఇది వండర్‌ఫుల్ జర్నీ. 25 ఏళ్లలో 38 సినిమాలు చేశాను. ఈ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు ఇండస్ట్రీలోనే సంపాదించుకున్నాను. శ్రీహరి గారితో సాంబయ్య సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీహరి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరంగా ఉంది. తన మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా.
ఈ బర్త్ డే స్పెషల్ ఏమిటి ?
-ఏప్రిల్ నుంచి మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మా అబ్బాయితో స్టార్ట్ చేస్తున్నాను.
9 ఏళ్లు గ్యాప్ రావడానికి కారణం?
-పిల్లలు బయట సినిమాలు చేస్తున్నారు. అందుకే గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. పెద్ద అబ్బాయి కెరీర్ సెట్ అయింది. చిన్నబ్బాయి సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటితో తను కూడా సెట్ అయిపోతాడు. ఏప్రిల్‌లో ఇద్దరి అబ్బాయిల ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. త్వరలోనే ఆ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు చెబుతాను.
-పెద్ద అబ్బాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. టైసన్ నాయుడు, సాహూతో సినిమాలు జరుగుతున్నాయి. గరుడన్‌కి రిమేక్‌గా చేస్తున్న సినిమా క్రిస్మస్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడిరామకృష్ణ గారి అల్లుడు నిర్మాణంలో చేస్తున్న సినిమా మ్యాసీవ్ బడ్జెట్ ఫిల్మ్. దానికి చాలా సీజీ వర్క్ ఉంటుంది. అది చాలా పెద్ద సినిమా. చాలా ఓపికగా చేస్తున్నారు.
తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకున్నారు కదా. ప్రొడక్షన్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి?
- నేను ప్రొడక్షన్‌లోనే ఉన్నాను. హిందీ ఛత్రపతి నేనే ఎగ్జిగ్యూట్ చేసి ఇచ్చాను. ప్రొడక్షన్‌లో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.
మీకు అగ్ర నిర్మాత అనే పేరు తీసుకొచ్చిన సినిమా ఆది. మళ్లీ ఎన్టీఆర్‌తో కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా?
-అది మన చేతిలో లేదు కదా. అన్నిసెట్ అవ్వాలి. నేను అందరితో టచ్‌లో ఉన్నాను. డైరెక్టర్ వినాయక్‌తో డైలీ మాట్లాడుతుంటాను. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం.