Amazon: ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ సిరీస్‍కు అంత ఖర్చయిందా! కారణాలను ఆరా తీస్తున్న అమెజాన్ సీఈవో-priyanka chopra citadel under scrutiny amazon ceo andy jassy asks his hollywood studios to explain ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amazon: ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ సిరీస్‍కు అంత ఖర్చయిందా! కారణాలను ఆరా తీస్తున్న అమెజాన్ సీఈవో

Amazon: ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ సిరీస్‍కు అంత ఖర్చయిందా! కారణాలను ఆరా తీస్తున్న అమెజాన్ సీఈవో

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 07, 2023 03:16 PM IST

Amazon: భారీ బడ్జెట్ పెట్టి నిర్మించిన సిటాడెల్ ఎందుకు ఫ్లాఫ్ అయిందని ఆరా తీస్తున్నారట అమెజాన్ సీఈవో. సిటాడెల్‍లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించింది.

సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్టర్
సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్టర్

Amazon: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ కోసం అమెజాన్ సొంతంగా నిర్మిస్తున్న కొన్ని భారీ ప్రాజెక్టులు ఇటీవల బోల్తా పడుతున్నాయి. భారీ బడ్జెట్‍తో రూపొందిస్తున్న కొన్ని సినిమాలు, సిరీస్‍లు అనుకున్న స్థాయిలో వ్యూవర్ షిప్ సాధించలేకున్నాయి. గతేడాది దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్‍తో 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : రింగ్స్ ఆఫ్ పవర్' అనే సిరీస్‍ను అమెజాన్ ప్రైమ్ నిర్మించింది. అయితే, ఇది అనుకున్న స్థాయిలో వ్యూవర్‌షిప్‍ను దక్కించుకోలేకపోయింది. ఇలా మరికొన్ని సిరీస్‍లు నిరాశపరిచాయి. ఈ జాబితాలోకి స్టార్ నటి ప్రియాంక చోప్రా, రిచర్డ్ మారెన్స్ కీలక పాత్రలు చేసిన సిటాడెల్ కూడా వచ్చి చేరిందని తెలుస్తోంది. దీంతో ఈ సిరీస్‍పై అమెజాన్ సీఈవో ఆరా మొదలుపెట్టారట.

గత తొమ్మిది నెలల్లో భారీ బడ్జెట్‍తో నిర్మించిన కొన్ని సిరీస్‍లు విఫలం కావడం పట్ల అమెజాన్ సీఈవో యాండీ జార్సీ ఆరా తీస్తున్నారని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెలువరించింది. సిటాడెల్ సిరీస్‍కు అంత భారీ బడ్జెట్ ఎందుకైందని పరిశీలన చేస్తున్నారని తెలిపింది. ఈ విషయాలను సంస్థ హాలీవుడ్ స్టూడియోను ఆయన ప్రశ్నించారని, ఈ సిరీస్ ఫ్లాఫ్ ఎందుకు అయిందని కూడా వివరణ కోరారని తెలుస్తోంది. సిటాడెల్ సిరీస్ ఫస్ట్ సీజన్ ఏప్రిల్‍లో అమెజాన్ ప్రైమ్‍ వీడియోలో విడుదలైంది. అయితే, అమెరికాలో కూడా ఏ వారంలోనూ టాప్-10 లిస్ట్ లో ఈ సిరీస్ నిలువలేకపోయింది. సిటాడెల్ సిరీస్‍ను నిర్మించేందుకు అమెజాన్ 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2వేల కోట్లు) ఖర్చు చేసిందని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.

గత తొమ్మిది నెలల్లో అమెజాన్ ప్రైమ్‍ నిర్మించిన ఆరు భారీ సిరీస్‍లు ఆశించిన స్థాయిలో వ్యూవర్‌షిప్‍ను సాధించలేకపోయాయని సమాచారం. భారీ బడ్జెట్ ప్రాజెక్టుల వల్ల ఆర్థిక భారం పడటంతో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ పదుల వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని ఆ రిపోర్ట్ పేర్కొంది.

డైసీ జోన్స్ & సిక్స్, ది పవర్, డెడ్ రింగర్స్, ది పిరిపెరల్ సిరీస్‍లను నిర్మించేందుకు ఒక్కోదానికి సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.800 కోట్లు) ఖర్చు చేసింది అమెజాన్. అయితే, వీటిలో ఏవీ కూడా అమెరికాలో ఎక్కువ మంది చూసిన షోల లిస్ట్ టాప్-10లో నిలువలేకపోయాయి. ఇక గతేడాది భారీ బడ్జెట్‍తో నిర్మించిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రింగ్స్ ఆఫ్ పవర్ కూడా వ్యూవర్ షిప్ పరంగా నిరాశపరిచింది.

ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్‍ ఫస్ట్ సీజన్‍లో ఒక్కో ఎపిసోడ్‍కు 20 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసి ఎనిమిది ఎపిసోడ్లు తీసుకురావాలని అమెజాన్ ముందుగా అనుకుంది. అయితే, కరోనా ప్రభావంతో విరామం రావటంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే, ఇప్పటి వరకు సిటాడెల్ ఫస్ట్ సీజన్‍లో ఆరు ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఇక సెకండ్ సీజన్‍కు జో రుసోను దర్శకుడిగా అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆయనకే భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.

Whats_app_banner