Priyamani: షారుక్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటెమ్ సాంగ్ చేశాను: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Priyamani: టాలీవుడ్ తోపాటు కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ లోనూ నటించిన ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షారుక్ ఖాన్ అంటే తనకు ఇష్టమని అందుకే చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఐటెమ్ సాంగ్ చేశానని ఆమె చెప్పింది.
Priyamani: తన నవ్వు, అందం, అభినయంతో టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి ప్రియమణి. ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో ఆమె నటించింది. అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన నెక్ట్స్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.
షారుక్ అంటే ఇష్టం: ప్రియమణి
తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి చెప్పింది. నిజానికి ఆ సినిమా తర్వాత అలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయాల్సిందిగా తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా.. తాను తిరస్కరించానని, కేవలం షారుక్ కోసమే ఆ పాట చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.
చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో 1234 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అనే పాటలో ప్రియమణి.. షారుక్ తో చిందులేసింది. "షారుక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ద్వేషించే వాళ్లు ఉండొచ్చు. కానీ అతన్ని ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను కలిసిన మంచి మనసున్న వాళ్లలో షారుక్ ఒకడు. మహిళలతోనే కాదు అందరితోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటాడు. ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలో నేను షారుక్ నుంచే నేర్చుకున్నాను" అని ప్రియమణి చెప్పింది.
"షారుక్ తో చెన్నై ఎక్స్‌ప్రెస్ రోజుల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా డ్యాన్స్ ఎక్కడో చూసి రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ తమకు కలవడానికి రమ్మని పిలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు" అని ప్రియమణి తెలిపింది. ఆ తర్వాత కూడా గతేడాది జవాన్ మూవీలో షారుక్ తో ప్రియమణి నటించింది. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రూ.1000 కోట్లకుపైనే వసూలు చేసింది.
మనోజ్ బాజ్‌పాయి గురించి..
ఇక ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో తాను కలిసి నటించిన మనోజ్ బాజ్‌పాయి గురించి కూడా ప్రియమణి గొప్పగా చెప్పింది. "మనోజ్ చాలా చురుగ్గా ఉంటాడు. అతనితో కలిసి నటించే సమయంలో చాలా చురుగ్గా ఉండాలి. అద్భుతమైన నటుడు. ఓ సీన్లో అప్పటికప్పుడు ఎలా మెరుగ్గా నటించాలో అతని దగ్గరే నేర్చుకున్నాను" అని ప్రియమణి చెప్పింది.
ప్రియమణి నటించిన భామాకలాపం 2 మూవీ శుక్రవారమే (ఫిబ్రవరి 16) ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. భామాకలాపం 2 చిత్రంలో ప్రియమణి, శరణ్య నటన.. వారి కాంబినేషన్‍లో వచ్చే సీన్లు మెప్పిస్తాయి. కొన్ని చోట్ల ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుంది. ఇక ఆమె ఆర్టికల్ 370 మూవీలో కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది. ఇందులో యామీ గౌతమ్ కూడా నటించింది. ఆదిత్య జంభాలే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.