Teaser: పుష్యమి నక్షత్రంలో ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్
Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న సారంగపాణి జాతకం మూవీ టీజర్ నవంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఈ టీజర్ రిలీజ్ డేట్‌ను ఫన్నీగా ఓ వీడియో ద్వారా ప్రియదర్శి రివీల్ చేశాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రూప కడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Teaser: టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. కామెడీ, ఎమోషన్స్ కలగలుపుతూ సినిమాల్ని తెరకెక్కించడం మోహనకృష్ణ స్టైల్. బలగంతో కెరీర్‌లోనేపెద్ద హిట్‌ను అందుకున్నాడు ప్రియదర్శి. మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రియదర్శి కాంబోలో సారంగపాణి జాతకం పేరుతో ఓ మూవీ రాబోతుంది. డిసెంబర్ 20న ఫన్ ఎంటర్‌టైనర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
టీజర్ రిలీజ్ డేట్...
సారంగపాణి జాతకం మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ఆదివారం ప్రియదర్శి ఫన్నీగా రివీల్ చేశాడు. నవంబర్ 21న ఉదయం 11 గంటల 12 నిమిషాలకు టీజర్‌ను విడుదలచేస్తామని ఓ వీడియో ద్వారా ప్రకటించాడు. టీజర్ రిలీజ్ టైమ్ కోసం ప్రియదర్శి ముహూర్తం కోసం వెతుకుతుండగా...కాకి వచ్చి అతడిని డిస్ట్రబ్ చేస్తుంది.
ఓ పిలగా అంటూ కాకి అతడిని పిలవడంతో...తాత నువ్వేంది ఈడ అంటూ ప్రియదర్శి ఆశ్చర్యపోయాడు. కొత్త పేరు..కొత్త సినిమా మంచి హుషారవుతున్నావు...యాడ జూసిన నీ పాటనే...ఎప్పుడు లేంది డ్యాన్స్ మస్తుగా జేశావు అని కాకి రూపంలో ఉన్న తాతయ్య ప్రియదర్శిపై పొగడ్తలు కురిపించినట్లుగా ఈ వీడియోలో చూపించారు. పాట ఊపులో దినేష్ మాస్టర్‌తో ఆడేశామంతే అంటూ ప్రియదర్శి బదులిచ్చాడు.
కొత్త ముచ్చట్లు...
తాతొచ్చిండు కొత్త ముచ్చట్లు ఏం లేవా అని కాకి అడగ్గా...అది చెబుదామనే మంచి ముహూర్తం కోసం వెతుకుతున్నా అని ప్రియదర్శి సమాధానమిచ్చాడు. రాబోయేవన్నీ మంచి రోజులే...ఇగ మన జాతకం మారుతోంది అని చెప్పి టీజర్ లాంఛ్ ఈవెంట్ డేట్ టైమ్ వెల్లడించాడు ప్రియదర్శి. పుష్యమి నక్షత్రం గురువారం నవంబర్ 21కి టీజర్‌ను విడుదలచేయనున్నట్లు తెలిపాడు.
అచ్చ తెలుగు అమ్మాయి...
సారంగపాణి జాతకం మూవీలో అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. మూఢ నమ్మకాల కారణంగా ఓ మధ్య తరగతి యువకుడు ఎలా నవ్వుల పాలు అయ్యాడనే పాయింట్‌తో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సారంగపాణి జాతకం మూవీని తెరకెక్కిస్తోన్నాడు.
జంధ్యాల స్టైల్‌లో...
మూఢనమ్మకాలకు, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమకు మధ్య సారంగపాణి అనే యువకుడు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడన్నది కామెడీతో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీలో చూపించబోతున్నారు. జంధ్యాల స్టైల్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సారంగపాణి జాతకం మూవీ నవ్విస్తూనే ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు.
మూడో సినిమా...
సారంగపాణి జాతకం సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్నారు. జెంటిల్‌మన్, సమ్మోహనం తర్వాత శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి చేస్తోన్న మూడో సినిమా ఇది. ఈ కామెడీ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తోండగా...పీజీ విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
బలగంతో హిట్...
ప్రియదర్శి హీరోగా నటించిన బలగం మూవీ కమర్షియల్ హిట్‌తో విమర్శకుల మన్ననల్ని అందుకుంది. . కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబ్టటింది. కమెడియన్‌గా ఓ భీమ్ బుష్, హాయ్ నాన్న, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ప్రియదర్శి.