Prithviraj Sukumanran: కఠినంగా ఆహార నియమాలు, 31 కిలోలు తగ్గాను: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
Prithviraj Sukumaran About The Goat Life: సలార్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తను నటించిన లేటెస్ట్ సినిమా ది గోట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలిపాడు.
Prithviraj Sukumaran About The Goat Life: మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ సినిమా ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). ఈ మూవీ మార్చి 28న పాన్ ఇండియా సినిమాగా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
వాస్తవ కథతో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్ నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు.
అప్పుడు ఈ ప్రాజెక్ట్‌తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా ది గోట్ లైఫ్‌తో నా జర్నీ మొదలైంది. 2018లో ది గోట్ లైఫ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా. అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం.
షూటింగ్ ప్రాసెస్‌లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్‌లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్‌తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది.
ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్‌ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు.
నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్‌లో నటించాను. కష్టపడినా నజీబ్ క్యారెక్టర్‌ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది.