Prey Movie Review: ప్రే మూవీ రివ్యూ - ప్రిడేటర్ ప్రీక్వెల్ ఎలా ఉందంటే
Prey Movie Review: ప్రిడేటర్ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన చిత్రం ప్రే. అమెరికాలో విమర్శకుల ప్రశంసలను పొందిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus hotstar)ద్వారా ఇంగ్లీష్, హిందీ భాషల్లో భారతీయ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Prey Movie Review: ప్రిడేటర్ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యాక్షన్ కథాంశాలతో రూపొందిన ప్రిడేటర్ సినిమాలు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ప్రిడేటర్ సినిమాలకు ప్రీక్వెల్‌గా రూపొందిన చిత్రం ప్రే. ఈ ప్రీక్వెల్‌కు డాన్ ట్రచెన్ బర్గ్ దర్శకత్వం వహించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజైంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే.
ట్రెండింగ్ వార్తలు
1719 నాటి కథ...
1719 కాలంలో కొమాంచి తెగకు చెందిన నరు అనే యువతికి వైద్యంలో ప్రావీణ్యం ఉంటుంది. ఆ తెగకు చెందిన ఇతర అమ్మాయిలకు భిన్నంగా వేటలో గొప్ప పేరు తెచ్చుకోవాలని నరు కలలుకంటుంది. ఆమె అన్నయ్య తాబే తో పాటు మిగిలిన వారందరూ నరు మాటలను హేళన చేస్తుంటారు. వారు నివసిస్తున్న అడవిలోకి ప్రిడేటర్ అడుగుపెడుతుంది జంతువుల్ని, మనుషుల్ని చంపేస్తుంటుంది.
ఆ ప్రిడేటర్ ఆనవాళ్లను పసిగట్టిన నరు తెగలోని అందరిని హెచ్చరిస్తుంది. కానీ ఎవరు ఆమె మాటలను నమ్మరు. ఆ ప్రిడేటర్‌ను హతమార్చాలని అనుకున్న నరు ప్రయత్నం ఫలించిందా? తనకంటే ఎన్నో రేట్లు బలమైన శత్రువుతో నరు ఎలాంటి పోరాటం చేసింది? ప్రిడేటర్‌తో జరిగిన పోరులో నరు అన్నయ్య తాబే ప్రాణాలను కోల్పోయాడా? నరు శక్తి సామర్థ్యాలను కొమాంచి తెగ గుర్తించిందా? లేదా? అన్నది ప్రే సినిమా మిగతా కథ.
పాయింట్ ఒక్కటే...(Prey Movie Review)
ప్రిడేటర్ సినిమాలన్నీ దాదాపు ఒకే పాయింట్‌తో సాగుతాయి. కంటికి కనిపించని శత్రువుతో హీరోహీరోయిన్లు సాగించే పోరాటంతో ముడిపడి తెరకెక్కుతుంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు క్లైమాక్స్‌లో హీరో విజయాన్ని సాధించడం అన్నది కామన్ గా కనిపిస్తుంది.
ఇప్పటివరకు వచ్చిన ప్రిడేటర్ సినిమాల్లో ఇదే చూపించారు. అయితే రీసెంట్‌గా వచ్చిన ప్రిడేటర్ సిరీస్ సినిమాల్లో యాక్షన్ బాగుందనే పేరొచ్చిన ఎమోషన్ మాత్రం వర్కవుట్ కాలేదు. ఈ ప్రీక్వెల్‌లో ఆ తప్పిదాన్ని రిపీట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. ఎమోషన్స్, యాక్షన్ రెండింటికి కథలో సమప్రాధాన్యతనిచ్చాడు.
తెలివి ముఖ్యం...
అమ్మాయి అనే ఒకే కారణంతో తన శక్తి సామర్థ్యాలను చులకన చేసిన వారందరికి నరు ఎలా సమాధానం చెప్పిందన్నది పవర్‌ఫుల్‌గా సినిమాలో చూపించాడు దర్శకుడు డ్రాన్ ట్రాచెన్ బర్గ్. ఓ సీన్‌లో హీరోయిన్ అన్న పులిని చంపుతాడు. కానీ ఆ పులిని చంపడానికి హీరోయిన్ ప్లాన్ మొత్తం అమలు చేస్తుంది. ఆ క్రెడిట్ మాత్రం ఆమెకు ఇవ్వకుండా తానే తీసుకుంటాడు. ఆ సీన్‌లో ఎమోషన్స్ చక్కగా పండాయి.
శత్రువును ఎదుర్కోవడానికి తొందరపాటు కంటే తెలివితేటలు ముఖ్యం అంటూ క్లైమాక్స్‌లో చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సినిమా మొత్తం ఆటవీ ప్రాంతంలోనే సాగుతుంది. గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉన్నా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కారణంగా రియలిస్టిక్ ఫీల్ కలుగుతుంది. లాజిక్స్ విషయంలో జాగ్రత్తపడ్డారు దర్శకుడు. ఒక రకంగా ప్రే లేడీ ఓరియెంటెండ్ యాక్షన్ సినిమా అనుకోవచ్చు.
యాక్షన్ ప్లస్ ఎమోషన్స్(Prey Movie Review)
ప్రే సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ కలబోసిన అమ్మాయిగా అంబెర్ మిడ్‌థండర్ ఇంప్రెసివ్ యాక్టింగ్‌ను కనబరిచింది. సినిమా మొత్తం ఆమె క్యారెక్టర్‌తోనే ముడిపడి నడుస్తుంది. గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది.
ప్రిడేటర్ అభిమానులను ప్రే తప్పకుండా మెప్పిస్తుంది. యాక్షన్ లవర్స్ మిస్ కాకుండా చూసే సినిమా ఇది.