Premalu OTT Streaming: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ కు టైమ్ దగ్గర పడింది. ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ టైమ్ కూడా అనౌన్స్ చేసింది ఆహా (aha) ఓటీటీ.
రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ప్రేమలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సంగతి తెలుసు కదా. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 6 గంటల నుంచి ప్రేమలు మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. గురువారం (ఏప్రిల్ 11) మూవీలోని ఓ ఫన్నీ సీన్ పోస్ట్ చేస్తూ.. ఈ విషయం చెప్పింది.
మూవీలో హీరో.. హీరోయిన్ కు ఫోన్ చేసి నీకు లూజ్ మోషన్స్ నీళ్లలాగా వస్తున్నాయా అని అడగడం, దానికి ఆమె వచ్చి చూడు.. ఏదో ఒకటి తీసుకురా అనే సీన్ ను ఆహా ఓటీటీ షేర్ చేసింది. "మరీ ఇలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం. ప్రేమలు ఏప్రిల్ 12 ఉదయం 6 గంటల నుంచి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ వీడియోను పోస్ట్ చేసింది.
ప్రేమలు మూవీ నిజానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతుందని భావించారు. అన్ని భాషల డిజిటల్ హక్కులను ఆ ఓటీటీయే దక్కించుకుందని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా తెలుగులోనూ రిలీజై బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు సాధించిన తర్వాత చివరి నిమిషంలో ఆహా సీన్లోకి ఎంటరైంది. భారీ మొత్తానికి తెలుగు వెర్షన్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది.
ఇప్పుడు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో మాత్రం ఆహాలోకి రానుంది. మిగతా భాషల స్ట్రీమింగ్ కూడా శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచే జరగనుంది. ఐదు రోజుల కిందటే ఈ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ.. తాజాగా టైమ్ కూడా వెల్లడించింది.
తెలుగులో ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.15 కోట్లకుపైనే వసూలు చేసింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా ప్రేమలు నిలిచింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సరదా లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంది. నస్లేన్ గఫూర్, మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించారు.
ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన రూ.100 కోట్ల సినిమాల్లో ఇదీ ఒకటి. ప్రేమలు కాకుండా మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం కూడా రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. ప్రస్తుతం మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ కాగా.. వచ్చే నెల మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.