Hanuman: ఆ సినిమాను అందుకే హిట్ కాలేదన్నారు.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్
Prasanth Varma In Hanuman 50 Days Celebrations: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించి భారీ విజయం అందుకున్న సినిమా హనుమాన్. తాజాగా హనుమాన్ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Hanuman 50 Days Celebrations: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించింది.
హనుమాన్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అంతేకాకుండా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హనుమాన్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్.
"50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది. అది సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. హనుమాన్ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్‌లో నడిచిందనేది చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం" అని ప్రశాంత్ వర్మ అన్నాడు.
"నా మొదటి మూవీ 'అ'. ఆ సినిమాను నాని గారు నిర్మించారు. ఆ సినిమా క్రిటికల్‌గా చాలా మంచి పేరు వచ్చింది. కమర్షియల్‌గా కూడా మంచి హిట్ అయ్యింది. అయితే సక్సెస్‌ని సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని సక్సెస్ ఈవెంట్ చేయలేదు. సక్సెస్ ఈవెంట్ చేయలేదు కాబట్టి ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదేమో అని చాలా మంది అనుకున్నారు. అందుకే సక్సెస్‌ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా ముఖ్యం" అని ప్రశాంత్ వర్మ అ! సినిమా గురించి తెలిపాడు.
"ఇలాంటి వేడుకలో అంతా పాల్గోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. రీమాస్టర్డ్ వెర్షన్ వస్తోంది. అది మిమ్మల్ని ఇంకా సర్‌ప్రైజ్ చేయబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలకు హనుమాన్ విజయం గట్టిపునాది వేసింది. ప్రేక్షకులని అలరించే క్యాలిటీ సినిమాలు మా యూనివర్స్ నుంచి రెడీ చేస్తున్నాం" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
"హనుమాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతుంది. హనుమాన్ ప్రపంచదేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదదాన్ని చాటబోతుంది. దీనికి కారణం మా నిర్మాత విజన్. ఆయనకు థాంక్స్. హనుమాన్ 50 రోజులు అనేది ఒక అడుగు మాత్రమే. ఈ సినిమాతో ఇంకెన్నో మెట్లు ఎక్కబోతున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమాని సబ్‌మిట్ చేయబోతున్నాం. కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం ఉంది" అని ప్రశాంత్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు.
"జై హనుమాన్ వర్క్ స్టార్ట్ అయింది. అతి త్వరలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం. హనుమాన్‌లో చివరి ఐదు నిమిషాలు ఎలా విపరీతంగా నచ్చిందో జై హనుమాన్‌లో అలా సినిమా అంతా ఉండబోతుంది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్‌ని భాద్యతగా తీసుకొని మీ రుణాన్ని జై హనుమాన్‌తో తీర్చుకోబోతున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై హింద్'' అని ప్రశాంత్ వర్మ తన స్పీచ్ ముగించాడు.