Pranitha Subhash Pregnant: మళ్లీ తల్లి కాబోతున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. రౌండ్ 2.. ప్యాంట్ అసలు పట్టడం లేదంటూ..
Pranitha Subhash Pregnant: పవన్ కల్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ప్రణీతా సుభాష్ మళ్లీ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
Pranitha Subhash Pregnant: తెలుగులో అత్తారింటికి దారేది మూవీతో పేరు సంపాదించిన నటి ప్రణీతా సుభాష్. ఐదేళ్ల కిందట వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చివరిసారి తెలుగు ప్రేక్షకులకు కనిపించిన ఆమె.. తర్వాత పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లయింది. ఇప్పుడు తాను రెండోసారి ప్రెగ్నెంట్ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసింది.
ప్రణీత రౌండ్ 2 పోస్ట్..
ప్రణీత సుభాష్ గురువారం (జులై 25) ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. అందులో తాను మరోసారి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా చాలా క్యూట్ గా ఉంది. "రౌండ్ 2.. ప్యాంట్లు ఇక నాకు ఫిట్ కావు" అనే క్యాప్షన్ తో ఈ పొటోలను ప్రణీత షేర్ చేసింది. అందులో ఆమె బ్లూ జీన్స్, బ్లాక్ బాడీకాన్ టాప్ లో బేబీ బంప్ చూపిస్తూ కనిపించింది.
జీన్స్ బటన్ విప్పేసి ఈ ప్యాంట్లు ఇక తనకు ఏమాత్రం పట్టడం లేదని ఆమె అనడం విశేషం. ఇక ఎక్స్ లో మరో ఫన్నీ క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది. "నాక్ నాక్.. ఎవరక్కడ? బేబీ.. బేబీ ఎవరు? బేబీ నంబర్ 2" అనే క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుండటంతో ఇలా రౌండ్ 2, బేబీ నంబర్ 2 అనే క్యాప్షన్లు పెట్టింది.
నిజానికి గత నెలలోనే తన భర్త నితిన్ రాజుకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె చేసిన ఓ పోస్ట్ చూసిన ఫ్యాన్స్.. ప్రణీత బేబీ బంప్ ను గమనించారు. అయితే ఆ ఫొటోల్లో ఆమె దానిని కవర్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అని కొందరు ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ చేశారు. ఇప్పుడీ విషయాన్ని ఆమెనే చెప్పడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రణీత తొలి సంతానం
ప్రణీత సుభాష్ 2021లో కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే నితిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2022లో వీళ్లు తమ తొలి సంతానానికి వెల్కమ్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే తమ కూతురు రెండో పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫొటోలను కూడా ప్రణీత షేర్ చేసింది. పెళ్లి తర్వాత రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ ఏడాదే మళ్లీ షూటింగులు మొదలుపెట్టింది.
మలయాళం సినిమా తంకమణి, కన్నడ సినిమా రమణ అవతార సినిమాల్లో ఆమె కనిపించింది. పెళ్లికి ముందు 2021లో చివరిగా భుజ్ అనే హిందీ మూవీలో ప్రణీత నటించింది. 2010లో కన్నడ మూవీ పోకిరి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తర్వాత ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం సినిమాల ద్వారా పేరు సంపాదించింది.