Prabhas Ravan Dahan: కన్ఫామ్.. రామ్‌లీలాలో రావణ దహనం చేసేది ఆదిపురుష్ ప్రభాసే
Prabhas Ravan Dahan: కన్ఫామ్.. రామ్‌లీలా మైదానంలో ఈసారి రావణ దహనం చేసేది ఆదిపురుష్ ప్రభాసే. ఈ విషయాన్ని రామ్‌లీలా కమిటీ కార్యదర్శి మరోసారి ధృవీకరించారు.
Prabhas Ravan Dahan: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. దసరా వేడుకల కన్నుల పండువగా జరిగే ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రామ్‌లీలా మైదానంలో ఈ ఏడాది రావణ దహనం చేసే అవకాశం ప్రభాస్‌కు దక్కింది. నెల రోజుల కిందటే ఈ వార్త వచ్చినా.. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అన్న సందేహం ఉండేది.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈసారి ప్రభాస్ వస్తున్నాడని రామ్‌లీలా కమిటీ సెక్రటరీ అర్జున్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి ప్రభాస్ రావణ దహనం చేయనున్నట్లు ఆయన చెప్పారు. "ఆదిపురుష్ మూవీలో రాముడిగా చేసిన ప్రభాస్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలవాలని మేము భావించాం. అందుకే రాష్ట్రపతి ముర్ము, సీఎం కేజ్రీవాల్‌లతోపాటు ప్రభాస్‌ను ఆహ్వానించాం. రామ్‌లీలాలో ఈ ముగ్గురూ రావణుడిపైకి బాణాలను సంధించనున్నారు" అని అర్జున్ కుమార్ చెప్పారు.
రామ్‌లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. "ఈసారి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తాం. మరింత మంది వచ్చి చూసేలా ఏర్పాట్లు చేశాం. అందుకే 22 మంది సెలబ్రిటీలను ఆహ్వానించాం. వాళ్లంతా రామ్‌లీలాకు రానున్నారు. ప్రభాస్‌ను గెస్ట్‌గా పిలవడానికి కూడా ఇదే కారణం" అని అర్జున్‌కుమార్ తెలిపారు.
ఇక రామ్‌లీలాలో ఈసారి రామలక్ష్మణులుగా ఎవరు ఉండబోతున్నారో కూడా ఆయన చెప్పారు. "రాఘవ్ తివారీ రాముడిగా, సంకట్ మోచన్ హనుమాన్ నటుడు అర్జున్ మండోలా లక్ష్మణుడిగా, సంకట్‌మోచన్ మహాబలి హనుమాన్ నటి దెబ్లీనా ఛటర్జీ సీతగా కనిపించనున్నారు. మహాభారతం నటుడు నిర్భయ్ వాద్వా హనుమాన్‌గా, రామాయణంలో రావణుడిగా కనిపించిన అఖిలేంద్ర మిశ్రా అదే క్యారెక్టర్‌లో కనిపిస్తారు" అని అర్జున్ కుమార్ చెప్పారు.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘువుడిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఆదివారం (అక్టోబర్ 2) రిలీజైంది. ఇక ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.