Prabhas ETV win: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ప్రభాస్ టాక్ షో.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఈటీవీ విన్.. ఓ ఆఫర్ కూడా..
Prabhas ETV win: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే ప్రభాస్ టాక్ షో వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ముందుగా చెప్పినట్లే టీవీ కంటే చాలా ముందుగానే రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూని స్ట్రీమింగ్ చేయనుంది.
Prabhas ETV win: ప్రభాస్ బుధవారం (అక్టోబర్ 23) తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ లు క్యూ కడుతున్నాయి. ఒకేరోజు అతని పాత సినిమాలు ఆరు రీరిలీజ్ కాగా.. ఇప్పుడు ఈటీవీ విన్ కూడా అతని స్పెషల్ టాక్ షోని బర్త్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది.
ప్రభాస్ టాక్ షో మరికొన్ని గంటల్లోనే..
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే ఈటీవీ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కోసం ఈటీవీ ప్రత్యేకంగా మొదలుపెట్టిన నీ ఉచ్ఛ్వాసం కవనం షో కోసం ప్రభాస్ వచ్చాడు. ఈ షో వచ్చే ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీవీ కంటే నాలుగు రోజులు ముందుగానే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (అక్టోబర్ 23) సాయంత్రం 6.30 గంటలకు ఈ టాక్ షోని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. ఇందులో సీతారామశాస్త్రితో ప్రభాస్ తన అనుబంధాన్ని పంచుకున్నాడు.
ఈటీవీ విన్ ముందు చెప్పినట్లే..
నీ ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ఈటీవీలో వస్తున్న ఈ షోలో ఈసారి ప్రభాస్ వస్తున్నట్లు ఇంతకుముందే ఈటీవీ విన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. ఆదివారం టెలికాస్ట్ అంటున్నారు.. 5 వేల రీట్వీట్స్ చేస్తే ముందే తీసుకురావడానికి ట్రై చేస్తామంటూ సరదాగా ఓ ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్ ను ప్రభాస్ అభిమానులు వైరల్ గా మార్చేశారు. ఈటీవీ విన్ ఊహించినట్లే ఏకంగా 6 వేలకుపైగా రీట్వీట్స్ చేశారు. దీంతో ముందుగా చెప్పినట్లే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు స్ట్రీమింగ్ కు సిద్ధం చేసింది.
రెబల్ స్టార్ ఆఫర్
ఈ షోతోపాటు అభిమానులకు తమ సబ్‌స్క్రిప్షన్ పై ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. తమ ఓటీటీ యానువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వాళ్లకు అదనంగా రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీనికోసం REBEL100 అనే కూపన్ కోడ్ ఉపయోగించాలని తెలిపింది.
ప్రభాస్ టాక్ షో చూడటానికి వెంటనే తమ ఓటీటీకి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరిన ఈటీవీ విన్.. దానికోసం అదనంగా ఈ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 27 వరకు ఉండనుంది.