Prabhas Remuneration: ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. కారణం ఇదేనా?
Prabhas Remuneration: ప్రభాస్ తన నెక్ట్స్ మూవీ కోసం రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ మూవీ పెద్ద సక్సెసైనా అతడు ఇలా చేయడానికి ఓ బలమైన కారణమే ఉందట.
Prabhas Remuneration: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల హీరో. అతని నుంచి అన్నీ అలాంటి సినిమాలనే అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగినట్లే ప్రభాస్ కూడా తన రెమ్యునరేషన్లను భారీగా పెంచేశాడు. ఒక్కో సినిమాకు అతడు సుమారు రూ.150 కోట్లు వసూలు చేస్తున్నాడు. అయితే తన నెక్ట్స్ మూవీ రాజా సాబ్ కోసం మాత్రం అతడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజా సాబ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్
సాధారణంగా ఓ సినిమా పెద్ద హిట్ అయితే తర్వాతి మూవీకి ఎలాంటి హీరో అయినా తన రెమ్యునరేషన్ పెంచేస్తాడు. అందులోనూ కల్కి 2898 ఏడీలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ హీరో రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా తర్వాత తాను చేస్తున్న ది రాజా సాబ్ మూవీ కోసం రూ.100 కోట్లే తీసుకుంటున్నట్లు ఓటీటీప్లే తన కథనంలో వెల్లడించింది.
మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం వరకు పూర్తయింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో నెక్ట్స్ రిలీజ్ కాబోయే సినిమా ఇదే. హారర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
కారణం ఇదేనా?
ది రాజాసాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవడానికి ఓ బలమైన కారణమే ఉందని కూడా అదే కథనంలో వెల్లడైంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ గతంలో నటించిన ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నది ఇతడే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.
దీంతో విశ్వప్రసాద్ భారీగానే నష్టపోయాడు. ఆ నష్టాలను పూడ్చడానికే ప్రభాస్ ఇప్పుడిలా ఈ రాజా సాబ్ మూవీ కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ది రాజా సాబ్ మూవీకి లాభాలు వచ్చి, ప్రొడ్యూసర్ తాను ఆదిపురుష్ వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందిన తర్వాతే తాను వాటా తీసుకుంటానని కూడా ప్రభాస్ హామీ ఇచ్చినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ చాలా వరకు సీరియస్ పాత్రలనే పోషిస్తున్నాడు. మధ్యలో వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాల్లో ప్రభాస్ పెద్దగా నవ్వించలేదు. ఈ మధ్యే వచ్చిన కల్కి 2898 ఏడీలో యాక్షన్ సీక్వెన్సెస్ తోపాటు కామెడీతోనూ అదరగొట్టాడు. అయితే ఓ పూర్తిస్థాయి కామెడీ మూవీని చాలా రోజుల తర్వాత ది రాజా సాబ్ రూపంలో ప్రభాస్ మరోసారి అందించబోతున్నాడు.
మరి మారుతి, ప్రభాస్ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్లో లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.