ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి కలిసి ఈ మైలురాయిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, అధికారిక 'బాహుబలి' ఖాతా "కట్టప్ప బాహుబలిని చంపకపోతే?" అని ప్రశ్నించగా.. రానా తన భల్లాలదేవ పాత్రను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు, ప్రభాస్ కూడా దానికి సరదాగా బదులిచ్చాడు.
బాహుబలిలో ప్రభాస్, రానా హోరాహోరీ పోరు అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి భారీ పర్సనాలిటీలు, వాళ్ల నటన దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకునేలా చేసింది. ఇప్పుడీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లో సరదాగా తలపడ్డారు. బుధవారం(జులై 16) రానా ఇన్‌స్టాగ్రామ్‌లో "కట్టప్ప బాహుబలిని చంపకపోతే?" అనే పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "నేనే చంపేసేవాడిని! (కోపంగా ఉన్న ముఖం, నవ్వుతున్న ఎమోజీలు)" అని బదులిచ్చాడు.
దీనికి ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమాధానమిచ్చాడు. దానితో పాటు 'రూ.1000 కోట్లు' అని బ్యాక్‌గ్రౌండ్‌లో రాసి ఉన్న తన పోస్టర్‌ను పంచుకున్నాడు. "నేను దీని కోసమే అలా జరగనిచ్చాను భల్లా!" అని ప్రభాస్ అనడం విశేషం. దీనికి రానా, "ఆహా బాహూ వెల్ ప్లేయ్‌డ్" అని తిరిగి బదులిచ్చాడు.
'బాహుబలి: ది బిగినింగ్' 2015లో విడుదలై.. ఈ కట్టప్ప బాహుబలిని చంపే సీన్ తో ముగిసింది. అమరేంద్ర బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన అతడే వెన్నుపోటు పొడవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇలా ఎందుకు చేశాడన్న ప్రశ్న రెండేళ్లపాటు వేధించింది. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నకు సమాధానం బాహుబలి 2తో దొరికింది.
ఈ ప్రశ్నే 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (2017)ని భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా మార్చింది. మొదటి భాగం క్లైమ్యాక్స్ సృష్టించిన సస్పెన్స్ సీక్వెల్ చరిత్రాత్మక బాక్సాఫీస్ విజయానికి కీలక పాత్ర పోషించింది. 'బాహుబలి: ది బిగినింగ్' ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేయగా, సీక్వెల్ మరింత పెద్ద విజయంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకుపైగా వసూలు చేసింది.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’లో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇక రానా ప్రస్తుతం తన రాబోయే సినిమా 'కొత్తపల్లిలో ఒకప్పుడు' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా జులై 18న థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం