Prabhas: చిన్న సినిమా గురించి పోస్ట్ చేసిన ప్రభాస్.. గ్రేట్ అంటున్న నెటిజన్లు
Prabhas on Love Reddy: ఓ చిన్న బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ మద్దతుగా నిలిచారు. ఆ మూవీ గురించి ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్‍పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలకు గతంలో బాసటగా నిలిచారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి గుర్తింపు దక్కేలా తన వంతు సాయం చేశారు. ఇప్పుడు, మరో చిన్న చిత్రానికి ప్రభాస్ చేయూతనిచ్చారు. లవ్ రెడ్డి సినిమా గురించి పోస్ట్ చేశారు. ఈ చిత్రం బాగున్నా జనాలు రావడం లేదంటూ మూవీ టీమ్ ఏకంగా ఫెయిల్యూర్ మీట్‍ను నిర్వహించింది. నిర్మాత, హీరో ఎమోషనల్ అయ్యారు. ఈ తరుణంలో లవ్ రెడ్డి చిత్రం గురించి ప్రభాస్ రియాక్ట్ అయ్యారు.
అభినందనలు తెలుపుతూ..
లవ్ రెడ్డి సినిమా టీమ్‍కు అభినందనలు తెలుపుతూ నేడు (అక్టోబర్ 20) తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో స్టోరీ పోస్ట్ చేశారు ప్రభాస్. “లవ్ రెడ్డి గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్” అని ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ లింక్ కూడా జతచేశారు.
సపోర్ట్ అడగడటంతో..
లవ్ రెడ్డి సినిమా టీమ్‍కు సపోర్ట్ చేయాలని ఓ సీనియర్ టెక్నిషియన్ ప్రభాస్‍ను అడిగారని సమాచారం. సినిమా బాగున్నా.. జనాలు రావడం లేదని, టీమ్‍కు మద్దతునివ్వాలని కోరారట. లవ్ రెడ్డి మూవీలో తనకు ఎవరూ పరిచయం లేకపోయినా.. ఆ సినిమాకు సపోర్ట్ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు. తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఈ మూవీ గురించి స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చేసింది. మరి ఈ చిత్రానికి కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.
ప్రశంసిస్తున్న నెటిజన్లు
లవ్ రెడ్డి సినిమాకు సపోర్ట్ చేయటంతో ప్రభాస్‍ను ప్రశంసిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మంచి మనసును రెబల్ స్టార్ మరోసారి చాటుకున్నారని రాసుకొస్తున్నారు. సినిమా టీమ్‍లో తనకు పరిచయం ఉన్న వారు ఎవరూ లేకపోయినా సాయం చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడం గొప్ప విషయం అంటూ ప్రభాస్‍ను ప్రశంసిస్తున్నారు.
లవ్ రెడ్డి సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ లవ్ కామెడీ మూవీకి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీమియర్లకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ టాక్ కూడా బాగానే దక్కించుకుంది. అయితే, శుక్రవారం (అక్టోబర్ 18) రిలీజైన ఓపెనింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో మూవీ టీమ్ బాగా నిరాశ చెందింది.
ఫెయిల్యూర్ మీట్
లవ్ రెడ్డి సినిమాకు మూవీ టీమ్ “బ్లాక్‍బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్”ను నిర్వహించి ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ ఈవెంట్ ద్వారా అయినా జనాల వద్దకు తమ సినిమాను తీసుకెళ్లాలని అనుకున్నట్టు నిర్మాత మదన్ గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రీమియర్ల ద్వారా తమ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా.. జనాలు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని తెలిపారు. ఫెయిల్యూర్ పేరుతో అయినా ప్రేక్షకుల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
లవ్ రెడ్డి చిత్రానికి ప్రిన్స్ హెన్రీ, కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఎంజీఆర్ ఫిల్మ్స్, గీతాంశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునంద బీ రెడ్డి, హేమలతా రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, రవీంద్ర జీ, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
కాగా, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వం ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. దర్శకుడు హను రాఘవపూడి మూవీ కూడా లైనప్‍లో ఉంది.