హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న కన్నప్ప నుంచి ఇటీవలే హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఈ సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా నటించనున్నారని ప్రస్తుతం హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. ప్రభాస్, నయనతార తొలిసారిగా యోగి సినిమాలో నటించారు.
వివి వినాయక్ దర్శకత్వం వహించిన యోగి మూవీ 2007లో వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్న ప్రభాస్, నయన్ కెమిస్ట్రీకి, పాటలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ద్వారా జత కట్టనున్నారని టాక్ వస్తోంది. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్, నయనతార శివపార్వతుల్లా దర్శనం ఇవ్వనున్నారట. అంటే ఇందులో ఇద్దరు కెమియో రోల్స్ చేయనున్నారని సమాచారం.
ఇదివరకే ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని ఓ ట్వీట్ ద్వారా మంచు విష్ణు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార కూడా చేరడంతో కన్నప్పపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా కన్నప్ప సినిమాకు మహాభారత టీవీ సీరియల్ ఫేమ్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో అంచనాలు మరింత తారాస్థాయికి చేరిపోయాయి.
కాగా మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి సంయుక్తంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మూవీని తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‍లో చిత్రీకరించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. సినిమాలో ముందుగా హీరోయిన్‍గా అనుకున్న నుపుర్ సనన్ షెడ్యూల్స్ కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే.