Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలా దేవి.. ఏమన్నారంటే?
Prabhas Marriage: రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తేనే ఉన్నారు. అయితే దీనిపై అతని పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి మరోసారి స్పందించారు.
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ పై స్పందిస్తూ.. ప్రభాస్ పెళ్లి గురించి ఆమె మాట్లాడారు. ప్రభాస్ కు సక్సెస్ రాదని గతంలో కొందరు అన్నారని, కానీ కల్కి 2898 ఏడీ రూపంలో వచ్చిందని, అలాగే అతని పెళ్లి కూడా జరుగుతుందని ఆమె చెప్పడం గమనార్హం.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది అతని పెళ్లవడం ఖాయం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొందరైతే ప్రభాస్ కు ఇక పెళ్లి జరగదని కూడా అన్నారు. బాహుబలి తర్వాత అతడు మళ్లీ సక్సెస్ చూడడని కూడా చెప్పారు. కానీ సలార్, కల్కి 2898 ఏడీతో అది తప్పని నిరూపించాడు.
అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలా దేవి చెప్పారు. ఈ మధ్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కల్కి సక్సెస్, ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. "ఓ మనిషి మంచితనం అనేది ఎంతవరకూ తీసుకెళ్తుందో కల్కి విజయం చూపించింది. కొందరు బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ విజయం చూడడు అని అన్నారు. కానీ వాళ్ల అంచనాలు తారుమారయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది" అని ఆమె అనడం విశేషం.
దానికి కూడా టైమ్ రావాలని అని అన్నారు. "మేము కూడా అతడు పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నాం. కానీ సమయం రావాలి కదా. మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం. పైనున్న కృష్ణంరాజుగారు అన్నీ చూసుకుంటారు. ఇప్పటి వరకూ అనుకున్నవన్నీ జరిగాయి. పెళ్లి కూడా కచ్చితంగా జరుగుతుంది" అని శ్యామలా దేవి చెప్పారు. నిజానికి గతేడాది కూడా ఆమె ప్రభాస్ పెళ్లి త్వరలోనే అన్నట్లుగా మాట్లాడారు. మరి ఆమె మాటలు ఎప్పుడు నిజమవుతాయో చూడాలి.
కల్కి 2898 ఏడీ సక్సెస్ గురించి..
ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీ సక్సెస్ గురించి కూడా శ్యామలా దేవి స్పందించారు. ఇప్పుడు ప్రభాస్ అంటే ప్రపంచం.. ప్రపంచం అంటే ప్రభాస్ అనేలా పరిస్థితి మారిపోయిందని, ప్రతి ఒక్కరూ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్నట్లు శ్యామలా దేవి తెలిపారు.
కల్కి మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసింది. త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ దారుణంగా విఫలమవడంతో ఇక అతనికి సక్సెస్ రాదని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ సలార్, కల్కి 2898 ఏడీ రూపంలో రెండు వరుస విజయాలను అతడు సొంతం చేసుకున్నాడు. ఇదే కాకుండా అతడు స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2లలోనూ నటిస్తున్నాడు.