రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం సినిమా చాలా ముఖ్యమైనది. ఆయనకు ఈ చిత్రమే ఫస్ట్ భారీ బ్లాక్‍బస్టర్. ఈ సినిమాతో ప్రభాస్‍కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్షం చిత్రం 2004 జనవరిలో థియేటర్లలో విడుదలైంది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద అదిరే కలెక్షన్లను దక్కించుకుంది. అంత క్రేజ్ దక్కించుకున్న వర్షం సినిమా మళ్లీ ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది.
వర్షం సినిమా వచ్చే నెల మే 23వ తేదీన థియేటర్లో రీ-రిలీజ్ కానుంది. 4కే వెర్షన్‍లో వెండితెరపైకి వస్తోంది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ విషయంపై నేడు (ఏప్రిల్ 13) అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది మే 23న వర్షం రీ-రిలీజ్ కానుందంటూ పోస్టర్ రివీల్ అయింది.
వర్షం సినిమాలో ప్రభాస్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, స్టైల్ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. ఈ సినిమా భారీ హిట్‍తో కెరీర్ తొలినాళ్లలోన స్టార్ హీరో రేంజ్‍లో రెబల్ స్టార్‌కు క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటించారు. ప్రభాస్, త్రిష జోడీ, వారి మధ్య కెమిస్టీ హైలైట్‍గా నిలిచింది.
వర్షం మూవీని లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్‍ల కలబోతతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కించారు డైెరెక్టర్ శోభన్. ఈ మూవీ 2004 జనవరి 14వ తేదీన విడుదలైంది. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.
వర్షం సినిమా ఫుల్ రన్‍లో రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనా. ఈ చిత్రానికి సుమారు రూ.8కోట్లలోపే బడ్జెట్ అయింది. మొత్తంగా భారీ వసూళ్లతో ఈ చిత్రం సత్తాచాటింది. ప్రభాస్‍కు ఇది ఫస్ట్ భారీ బ్లాక్‍బస్టర్ అయింది.
వర్షం మూవీలో గోపీచంద్ నెగెటివ్ రోల్ చేశారు. విలన్‍గా మెప్పించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్‍గా ఉంటుంది. సునీల్, చంద్రమోహన్, అజయ్, శ్రీరంజనీ, పరుచూరి వెంకటేశ్వర రావు కీలకపాత్రలు పోషించారు. ప్రభాస్ సోదరి పాత్రలో యాంకర్ సుమ కనిపించారు.
ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలు కూడా ఈ మూవీ హిట్ అవడంలో ఓ కీలకపాత్ర పోషించాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు ఎంఎస్ రాజు. రీ-రిలీజ్‍లో వర్షం చిత్రం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. ఏప్రిల్‍లో రావాల్సిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం వాయిదా పడింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్‍లో ఈ పీరియడ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఖరారైనట్టు టాక్.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. ప్రశాంత్ వర్మతోనూ ఓ మూవీకి రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రశాంత్ నీల్‍తో సలార్ 2, నాగ్ అశ్విన్‍తో కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ లైనప్‍లో ఉన్నాయి.
సంబంధిత కథనం