Ustaad Bhagat Singh Promo: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సర్‌ప్రైజ్‍కు డేట్ ఫిక్స్.. పొలిటికల్ టచ్‍తో..!
Ustaad Bhagat Singh Promo Release: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ప్రోమో రిలీజ్‍కు డేట్ ఖరారైంది. ఈ విషయంపై మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది. ఈ ప్రోమోలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
Ustaad Bhagat Singh Promo: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం గ్యాంగస్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉండనుంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా మూడేళ్లుగా నిరీక్షణలో ఉంది. హరీశ్ శంకర్ డైరెక్షన్‍లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా పవన్ కల్యాణ్ లైనప్‍లో ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఆ సినిమాల షూటింగ్ నిలిచింది. అయితే, ఈ తరుణంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సర్‌ప్రైజ్ రానుంది.
ప్రోమో రిలీజ్ డేట్
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ డిసైడ్ అయింది. మార్చి 19వ తేదీన ఈ ప్రోమో వీడియో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి డబ్బింగ్ పనులను కూడా పవన్ కల్యాణ్ పూర్తి చేశారు.
మార్చి 19న ఊహించనిది వస్తోందని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఫొటోలో ఉన్నారు. దీంతో ఇది సినిమా ప్రోమోకు సంబంధించిన అప్‍డేట్ అని ఖరారైంది.
పొలిటికల్ టచ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‍సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు పవన్. అయితే, ఇంత బిజీలోనూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రోమో పనులు పూర్తి చేశారు. ఈ ప్రోమోలో పొలిటికల్ టచ్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. జనసేన ఎన్నికల గుర్తయిన గాజుగ్లాస్‍ను హైలైట్ చేయడంతో పాటు పొలిటికల్ డైలాగ్ కూడా ఈ ప్రోమోలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‍లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. షూటింగ్ కూడా కొంత భాగమే జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ షెడ్యూల్‍ను బట్టి ఈ మూవీ చిత్రీకరణ ముందుకు సాగనుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల హీరోయిన్‍గా నటించనుండగా.. అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్, గౌతమి కీరోల్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం నుంచి కూడా మరో గ్లింప్స్ త్వరలో రానున్నట్టు టాక్ నడుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ చిత్రం క్యాన్సల్ కాలేదని, త్వరలో స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని ఆ మూవీ టీమ్ గతనెలలో వెల్లడించింది.