Pothugadda Review: పోతుగడ్డ రివ్యూ - నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Pothugadda Review: పృథ్వీ దండమూడి, విస్మయశ్రీ జంటగా నటించిన పోతుగడ్డ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ పోతుగడ్డ ఈటీవీ విన్ ద్వారా నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పృథ్వీ దండమూడి, విస్మయశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ఆడుకాలం నరేన్, శత్రు కీలక పాత్రలు పోషించారు. రక్ష వీరన్ దర్శకత్వం వహించాడు. పోతుగడ్డ మూవీ ఎలా ఉందంటే?

బస్ జర్నీ…
గీత (విస్మయ శ్రీ), కృష్ణ (పృథ్వీ దండమూడి) ప్రాణంగా ప్రేమించుకుంటారు. ప్రేమాభిమానాల కంటే పరువే ముఖ్యమని భావించే తండ్రి తమ ప్రేమకు ఒప్పుకోవడని భావించిన గీత...కృష్ణతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తండ్రికి తన ప్రేమ విషయం తెలిసేలోపు ప్రియుడితో కలిసి రాష్ట్రం దాటేసి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది. కర్నూల్ నుంచి రాయచోటి వెళ్లే బస్ ఎక్కుతారు.
ఈ ప్రేమ జంట ప్రయాణిస్తోన్న బస్‌పై ఎటాక్ చేసి అందులోనివారందరిని చంపేయాలని పోతుగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సముద్రతో (ఆడుకాలం నరేన్) పాటు అపోజిషన్ లీడర్ భాస్కర్ (శత్రు) తమ మనుషులతో కలిసి కుట్రలు పన్నుతారు.
ఈ ప్రేమ జంటకు పొలిటికల్ లీడర్లకు ఉన్న సంబంధం ఏమిటి? ఎన్నికల్లో సముద్రపై గెలవడానికి భాస్కర్ ఏం చేశాడు? గీత తండ్రి ఎవరు? గీత, కృష్ణలను చంపడానికి వచ్చిన వెంకట్ (ప్రశాంత్ కార్తీ) వారికి ఎందుకు సాయం చేశాడు? కృష్ణకు స్నేహితుడు అంజి ఎలాంటి నమ్మకద్రోహం చేశాడు? అన్నదే పోతుగడ్డ మూవీ కథ.
పరువు హత్యల పాయింట్...
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు పరువు హత్యల పాయింట్‌ను జోడించి పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు రక్ష వీరమ్ పోతుగడ్డ మూవీని తెరకెక్కించాడు.ఈ సినిమా కథ మొత్తం బస్ జర్నీ నేపథ్యంలోనే సాగుతుంది.
మంచివాళ్లు చెడ్డవాళ్లుగా....
బస్‌లో హీరోహీరోయిన్లతో కలిసి ప్రయాణం చేసే క్యారెక్టర్లకు సంబధించి వచ్చే ట్విస్ట్‌లు, టర్న్‌లతో చివరి వరకు ఆడియెన్స్ ఊహలకు అందకుండా కథను నడిపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. బస్ ప్యాసింజర్స్‌లో మంచివాళ్లు అనుకున్న వాళ్లు చెడ్డవాళ్లుగా ఎలా టర్న్ అయ్యారు...చెడ్డవాళ్లుగా పొరపడిన వాళ్లు నాయకానాయికలకు ఎలా సాయం చేశారన్నది రాసుకున్న తీరు బాగుంది.
ప్రేమ జంట పోరాటం...
. పరువు కాపాడుకోవడం కోసం ఓ ఎమ్మెల్యే ఆరాటం...గెలుపు కోసం మరో నాయకుడు వేసే ఎత్తులు...మధ్యలో ప్రాణాలు దక్కించుకోవడం కోసం ప్రేమ జంట పోరాటాన్ని సమాంతరంగా ఆవిష్కరిస్తూ సినిమాను నడిపించారు దర్శకుడు. కూతురు తొమ్మిది నెలల్లో పడుతుంది...కానీ పరువు వందేళ్లు ఉంటుంది అనే డైలాగ్స్ బాగున్నాయి. బస్ జర్నీకి ప్రేమకథను, పొలిటికల్ అంశాలను లింక్ చేస్తూ రాసుకున్న సీన్లు కన్వీన్సింగ్‌గానే అనిపిస్తాయి.
ప్రజెంటేషన్‌లో తడబాటు...
కథా పరంగా చూసుకుంటే పోతుగడ్డ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ప్రజెంటేషన్‌లోనే దర్శకుడు తడబడ్డాడు. బస్‌లోనే హీరోహీరోయిన్లను చంపాలనుకున్న విలన్, ప్రియురాలిపై కన్నేసిన మరో వ్యక్తి ఉంటారు. ఆ విలన్స్ బారి నుంచి ప్రేమికులు ఎలా తప్పించుకుంటారనే టెన్షన్స్‌ను బిల్డ్ చేయడంలో డైరెక్టర్ ఫెయిలయ్యాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్నట్లుగా కాకుండా రొమాంటిక్ ట్రిప్ కోసం వెళుతున్నట్లుగా హీరోహీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్లు కనిపిస్తాయి. పొలిటికల్ సీన్లు బాగున్నా కీలకమైన లవ్‌స్టోరీలో సంఘర్షణ సరిగా పండలేదు.
ట్విస్ట్‌లు బాగున్నాయి...
హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో పాటు గుడ్డివాడిగా కనిపించిన మరో క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ బాగుంది. అలాంటివి ఇంకొన్ని రాసుకుంటే బాగుండేది. రాయలసీమ యాస విషయంలో నేటివిటీ మిస్సైయినట్లు అనిపించింది.
సీనియర్ యాక్టర్లు...
పొలిటికల్ లీడర్లుగా సీనియర్ యాక్టర్లు ఆడుకాలం నరేస్, శత్రు క్యారెక్టర్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. వీరిద్దర నటన కథకు తగ్గట్లుగా బాగుంది. ప్రేమ జంటగా పృథ్వీ దండమూడి, విస్మయ తేలిపోయారు. యాక్టింగ్‌లో మెచ్యూరిటీ కనిపించలేదు. వెంకట్ పాత్ర చేసిన ప్రశాంత్ కార్తీ, అంజి క్యారెక్టర్‌లో కనిపించి వెంకీ లింగం తమ నటనతో ఆకట్టుకున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్ మూవీ...
పోతుగడ్డ కాన్సెప్ట్ పరంగా బాగుంది. స్క్రీన్‌ప్లే, ప్రజెంటేషన్‌లో మాత్రం కొత్తదనం మిస్సయింది. ఓవరాల్‌గా పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్ ఓ సారి చూడొచ్చు.