Ponniyin Selvan 1 Twitter Review: మణిరత్నం సినిమా ఓ అద్భుతం.. పొన్నియిన్ సెల్వన్ ట్విటర్ రివ్యూ
Ponniyin Selvan 1 Twitter Review: మణిరత్నం సినిమా ఓ అద్భుతం అంటూ పొన్నియిన్ సెల్వన్ 1పై ట్విటర్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ponniyin Selvan 1 Twitter Review: మణిరత్నం 40 ఏళ్ల కల.. తమిళుల గౌరవం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 మూవీపై ట్విటర్‌లో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ ఓ అద్భుతం అంటూ రివ్యూలు రాస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా పీఎస్ 1 రిలీజైంది.
అయితే ఈ సినిమాకు తమిళనాడులో మాత్రం క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక మణిరత్నం కథ చెప్పిన తీరు కూడా వాళ్లకు తెగ నచ్చేసింది. చాలా మంది ఈ సినిమాను బాహుబలితో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
రెండు సినిమాల్లో ఏది బాగుందో చెప్పాలంటూ కొందరు అడుగుతున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మూవీకే హైలైట్ అని మరికొందరు ట్విటర్ రివ్యూల్లో రాస్తున్నారు. సినిమాను థియేటర్లలో చూస్తూ మొబైల్స్‌లో తీసిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా విక్రమ్, కార్తీల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ గూస్‌బంప్స్ వస్తున్నాయంటూ రాశారు.
కల్కి నవలను స్క్రీన్‌పై చూపించిన తీరు అద్భుతమంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఇక పొన్నియిన్ సెల్వన్ చరిత్ర తెలిసిన వాళ్లకు ఈ సినిమా మరింత నచ్చుతుందని మరో అభిమాని ట్వీట్ చేశాడు. సినిమా చూసిన వాళ్లలో చాలా వరకూ ఐదుకిగాను నాలుగు స్టార్ల వరకూ ఇవ్వడం విశేషం. స్లో స్క్రీన్‌ప్లే అయినా ఎక్కడా బోర్ కొట్టదని, మణిరత్న మేకింగ్ సూపర్ అని మరో యూజర్ చెప్పాడు.
చాలామంది పీఎస్ 1 క్లైమ్యాక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ పీఎస్ 1 ముగించిన తీరు బాగుందని కొందరు తమ ట్విటర్ రివ్యూల్లో రాశారు.
ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందించారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.