Allu Arjun Case: అల్లు అర్జున్‍పై కేసు విత్‍డ్రా అంశం: పోలీసుల మాట ఇదే!
Allu Arjun - Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‍పై కేసు వెనక్కి తీసుకుంటానని మృతురాలి భర్త ఇటీవల చెప్పారు. అయితే, ఈ విషయంపై పోలీసులు ఏం చెప్పారో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఓ రోజు చంచల్‍గూడ జైలులో ఉన్నారు. మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. ఇటీవలే చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‍లో విచారణకు హాజరయ్యారు. రేవతి కుటుంబానికి ఇటీవలే రూ.2కోట్లను అల్లు అరవింద్ ప్రకటించారు. తాను అల్లు అర్జున్‍పై కేసు ఉపసంహరించుకుంటానని రేవతి భర్త భాస్కర్ ఇటీవల చెప్పారు. కేసు విత్‍డ్రా అంశంపై పోలీసులు తమ మాటను చెప్పినట్టు సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
సాధ్యం కాదన్నారట
అల్లు అర్జున్‍పై కేసులు విత్‍డ్రా చేసుంటానని భాస్కర్ చెప్పారు. అయితే, అది సాధ్యం కాదని పోలీసులు తేల్చిచెప్పేశారని సమాచారం బయటికి వచ్చింది. తొక్కిసలాటలో ఓ ప్రాణం పోయిందని, ఈ దశలో ఎట్టిపరిస్థితుల్లో కేసును ఉపసంహరించుకోవడం జరగదని తేల్చిచెప్పేశారని సమాచారం.
స్వల్ప గాయాలు అయితే కేసును వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయని, ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోవడం, ఓ బాలుడు తీవ్రంగా గాయపడడంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశమే లేదని పోలీసులు తేల్చిచెప్పేశారట. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. ఈ కేసుపై త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది.
రెగ్యులర్ బెయిల్ కోసం..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‍పై అల్లు అర్జున్ ఉన్నారు. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం బన్నీ టీమ్ ప్రయత్నిస్తోంది. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‍పై విచారణ ఇటీవల వాయిదా పడింది. డిసెంబర్ 30న ఈ విషయంపై వాదనలు విననుంది న్యాయస్థానం. అల్లు అర్జున్‍కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.
తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణం అనేలా అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటంతో ఈ విషయం మరింత సీరియస్ అయింది. తొక్కిసలాట తర్వాత కూడా అల్లు అర్జున్ ర్యాలీ చేశారని, సరిగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. అల్లు అర్జున్ కూడా ప్రెస్‍మీట్ పెట్టి తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను ర్యాలీ చేయలేదని, అభిమానులు తప్పుకునేందుకు అభివాదం మాత్రమే చేశానని అన్నారు. తొక్కిసలాట పూర్తి ప్రమాదం అని తెలిపారు. దాని తర్వాత పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. మరికొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు.
రేవతి కుటుంబానికి రూ.2కోట్లు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను చూసేందుకు ఇటీవలే ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఈ విషయం వెల్లడించారు. అల్లు అర్జున్ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, మైత్రీ మూవీమేకర్స్ రూ.50లక్షలు ఇచ్చారని తెలిపారు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఆసుపత్రికి వెళ్లారు.
సంబంధిత కథనం