Mohan Babu Murder Case: సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడంటూ ఫిర్యాదు.. సంచలనం రేపుతున్న కేసు.. నిజం కాదంటున్న భర్త-police complaint filed against mohan babu on actress soundarya death case ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohan Babu Murder Case: సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడంటూ ఫిర్యాదు.. సంచలనం రేపుతున్న కేసు.. నిజం కాదంటున్న భర్త

Mohan Babu Murder Case: సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడంటూ ఫిర్యాదు.. సంచలనం రేపుతున్న కేసు.. నిజం కాదంటున్న భర్త

Hari Prasad S HT Telugu

Mohan Babu Murder Case: మోహన్ బాబు మరో తీవ్రమైన ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. సౌందర్యది హత్య అని, ఆమెతో మోహన్ బాబుకు భూ వివాదాలు ఉన్నాయని ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడంటూ ఫిర్యాదు.. సంచలనం రేపుతున్న కేసు

Mohan Babu Murder Case: నటుడు మోహన్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఎప్పుడో 21 ఏళ్ల కిందట హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నటి సౌందర్యది హత్యే అంటూ ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూవివాదం విషయంలోనే ఇలా జరిగిందని ఆ వ్యక్తి చెబుతుండగా.. ఇందులో మోహన్ బాబు తప్పేమీ లేదని దివంగత సౌందర్య భర్త రఘు చెప్పడం గమనార్హం.

మోహన్ బాబుపై మర్డర్ ఆరోపణలు

ఇప్పటికే తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఎపిసోడ్, జర్నలిస్టుపై దాడి కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న మోహన్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా సౌందర్యను హత్య చేయించారంటూ ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఖమ్మంకు చెందిన చిట్టిమల్లి అనే వ్యక్తి మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి సౌందర్యతో అతనికి భూ వివాదం ఉందని అందులో ఆరోపించాడు.

శంషాబాద్ దగ్గరలోని జల్‌పల్లిలో ఆరు ఎకరాల భూమి, గెస్ట్ హౌజ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అన్నారు. ఆ భూమిని అమ్మాలంటూ సౌందర్య, ఆమె సోదరుడు అమర్‌నాథ్ పై మోహన్ బాబు ఒత్తిడి తెచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు వాళ్లు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కూడా చెప్పారు. సౌందర్యను హత్య చేశారని, ఆ తర్వాత మోహన్ బాబు ఆ భూమిని బలవంతంగా లాక్కొన్నారని ఆ ఫిర్యాదులో వెల్లడించారు.

తనకు కూడా మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉందని చిట్టిమల్లి ఆ ఫిర్యాదులో తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాలేదు.

అలాంటిదేమీ లేదు: సౌందర్య భర్త

అయితే మోహన్ బాబుపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలపై దివంగత సౌందర్య భర్త రఘు స్పందించారు. తమకు, మోహన్ బాబుకు మధ్య ఎలాంటి భూవివాదాలు లేవని, ఇలాంటి తప్పుడు ఆరోపణలను పబ్లిష్ చేయొద్దని ఓ లేఖ విడుదల చేశారు. తన భార్య నుంచి మోహన్ బాబు అక్రమంగా ఎలాంటి భూమి స్వాధీనం చేసుకోలేదని అన్నారు.

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సౌందర్య.. 2004లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి కరీంనగర్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు ఏడాదే రఘు అనే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను ఆమె పెళ్లి చేసుకుంది. 31 ఏళ్ల వయసులో, ప్రెగ్నెంట్ గా ఉండగానే ఆమె ఇలా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.

మోహన్ బాబు, సౌందర్య కూడా పలు సినిమాల్లో కలిసి నటించారు. సౌందర్య చివరి సినిమా శివ శంకర్ కూడా మోహన్ బాబుతో కలిసి నటించినదే. ఈ మూవీ ఆమె మరణం తర్వాత రిలీజైంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.