Poacher Web Series: పోచర్ వెబ్ సిరీస్.. ప్రైమ్ వీడియోలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎందుకు చూడాలి?
Poacher Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన పోచర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో సంచలనంగా మారింది. కేరళలో జరిగిన ఓ నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అసలు ఎందుకు చూడాలి?
Poacher Web Series: పోచర్ వెబ్ సిరీస్ మనుషులుగా మన చుట్టూ ఉన్న పర్యావరణం పట్ల మనం వ్యవహరిస్తున్న తీరుపై పదునైన ప్రశ్నలను సంధించింది. అసలు క్రైమ్ అంటే ఏంటి? ఓ మనిషి మరో మనిషి చంపడమేనా? ఓ మనిషిని మరో మనిషి దోచుకోవడమేనా? ఇలాంటి నేరాలకే మనం స్పందించాలా?
ఎక్కడో అడవుల్లో ఎవరో దుండగులు ఓ ఏనుగును చంపితే, దాని దంతాలతో కోట్ల వ్యాపారం చేస్తుంటే మనకేమీ పట్టనట్లే ఉందామా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ పోచర్ వెబ్ సిరీస్.
అసలేంటీ పోచర్?
పోచర్ వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. కేరళలో 2015లో జరిగిన అతిపెద్ద ఏనుగు దంతాల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథే ఈ పోచర్. బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఈ సిరీస్ ను నిర్మించింది. ఈ 8 ఎపిసోడ్ల క్రైమ్ డ్రామాను తన కెరీర్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రిచీ మెహతా క్రియేట్ చేశాడు.
దేశంలో కఠినమైన వైల్డ్ లైఫ్ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత 20 ఏళ్లుగా అడవుల్లో ఏనుగుల వేట సాగడం లేదని, వాటి దంతాల స్మగ్లింగ్ ఆగిపోయిందనుకున్న సమయంలో జులై, 2015లో అతిపెద్ద ఐవరీ స్మగ్లింగ్ రాకెట్ బయటకు వస్తుంది. ఈ ఏనుగు దంతాల స్మగ్లింగ్ అసలు మళ్లీ ఎలా మొదలైంది? దాని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఈ ఐవరీ స్మగ్లింగ్ రాకెట్ మార్కెట్ విలువ ఎంత అన్నది ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ లో కేరళ అడవుల అందాలను కూడా ఎంతో బాగా చూపించారు.
ఆపరేషన్ శిఖర్ ఆధారంగా..
ఈ ఏనుగు దంతాల స్మగ్లింగ్ కు చెక్ పెట్టడానికి 2015లో జరిగిన ఆపరేషన్ శిఖర్ ఆధారంగా పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. దక్షిణ కేరళలోని అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఏనుగుల వేటకు సంబంధించిన విచారణ 2015 నుంచి 2017 వరకూ సాగింది. అందులో పాల్గొన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీసులు అసలు నేరస్థులను పట్టుకోవడానికి పడిన శ్రమ, వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టిన తీరును ఈ పోచర్ వెబ్ సిరీస్ కళ్లకు కట్టింది.
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆ విచారణను స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అంతేకాదు ఓ మనిషి మనం ఎటు వెళ్తున్నాం? మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటూ, మనతోపాటే ఈ భూమిపై ప్రశాంతంగా జీవిస్తూ మన మనుగడకు సాయం చేస్తున్న వణ్యప్రాణులను వేటాడుతూ మన భవిష్యత్తును మనమే కాలరాసుకుంటున్నామా అన్న ప్రశ్నలకు కూడా సమాధానం ఈ పోచర్ వెబ్ సిరీస్.
పోచర్ చివరి ఎపిసోడ్ హైలైట్
ఈ పోచర్ మొత్తం 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్. అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపించినా.. ఓ క్రైమ్ ను విచారించే తీరు ఆకట్టుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ గడుస్తున్న కొద్దీ మొత్తం బింజ్ వాచ్ చేసేలా ఈ సిరీస్ మనల్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ ఈ సిరీస్ కు హైలైట్ అని చెప్పాలి.
కేరళలో జరిగిన ఈ దారుణమైన క్రైమ్ ఢిల్లీ వీధుల్లో ఎలా బయటపడింది? అక్కడి ప్రమాదాల నుంచి తప్పించుకొని ఇన్వెస్టిగేషన్ టీమ్ మళ్లీ ఎలా కేరళకు చేరుకున్నదీ చాలా చక్కగా, ఉత్కంఠభరితంగా చూపించారు. గంటపాటు సాగే చివరి ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు.
ఇక ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య జీవించేశారనే చెప్పాలి. ఓవరాల్ ఇప్పటి వరకూ మీరు ఈ సిరీస్ చూడకపోతే వెంటనే ఈ వీకెండ్ లో ప్లాన్ చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ పోచర్ వెబ్ సిరీస్ తప్పక చూడండి.