Phir Aayi Haseen Dillruba Review: తాప్సీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!-phir aayi haseen dillruba review in telugu taapsee pannu netflix ott bold movie review phir aayi haseen dillruba ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Phir Aayi Haseen Dillruba Review: తాప్సీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!

Phir Aayi Haseen Dillruba Review: తాప్సీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!

Sanjiv Kumar HT Telugu
Aug 12, 2024 04:09 PM IST

Phir Aayi Haseen Dillruba Movie Review In Telugu: 2021లో నేరుగా ఓటీటీలో రిలీజైన హసీన్ దిల్‌రూబా మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఓటీటీ బోల్డ్ మూవీ ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే నటించిన ఈ మూవీ ఆకట్టుకుందో లేదో ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా రివ్యూలో చూద్దాం.

తాప్సీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!
తాప్సీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!

టైటిల్: ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా

నటీనటులు: తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు

కథ: కనిక ధిల్లాన్, అనుజ్ కుమార్ పాండే

దర్శకత్వం: జయప్రద్ దేశాయ్

నిర్మాతలు: ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ

సంగీతం: సాచెట్ పరంపర, అనురాగ్ సైకియా

సినిమాటోగ్రఫీ:

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్

స్ట్రీమింగ్ డేట్: ఆగస్ట్ 9, 2024

Phir Aayi Haseen Dillruba Review Telugu: 2021లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ హసీన్ దిల్‌రూబా. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్, జిమ్మీషెర్గిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ బోల్డ్ మూవీ ఆరు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది.

రెండు మూడు కొత్త పాత్రలను యాడ్ చేస్తూ జయప్రద్ దేశాయ్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ ఓటీటీ బోల్డ్ రొమాంటిక్ మూవీ ఆకట్టుకుందా లేదా అనేది ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూలో తెలుసుకుందాం.

మొదటి పార్ట్ హసీన్ దిల్‌రూబా కథ:

రిషు (విక్రాంత్ మాస్సే), రాణి (తాప్సీ పన్ను) పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. అయితే, వీరి కాపురం సజావుగా సాగని సమయంలో ఇంటికి వచ్చిన రిషి కజిన్ బ్రదర్ నీల్ త్రిపాఠి (హర్షవర్ధన్ రాణే)కు దగ్గర అవుతుంది. అతనితో ఎఫైర్ కొనసాగించడమే కాకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.

కానీ, అనూహ్యంగా రాణిని నీల్ ఇంటిమేట్ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో నీల్‌ను భార్యాభర్తలు రిషు, రాణి ఇద్దరూ కలిసి చంపేస్తారు. కానీ, ఇంట్లో జరిగిన ప్రమాదంలో రిషు చనిపోయాడని పోలీసులను, లోకాన్ని నమ్మించి ఎస్కేప్ అవుతారు.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా కథ:

అయినవాళ్లందరికి దూరంగా ఆగ్రాలో ఒంటరిగా బ్యూటిపార్లర్ నడిపిస్తూ జీవణం సాగిస్తుంటుంది రాణి. కానీ, ఫుడ్ డెలీవరీ జాబ్ చేస్తున్న భర్త రిషును ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు దొంగచాటుగా కలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రాణి ఇంటి ఓనర్‌కు వైద్యం చేయడానికి వచ్చే కాంపౌండర్ అభిమన్యు (సన్నీ కౌశల్) రాణిని ప్రేమిస్తాడు. కానీ, రాణి పట్టించుకోదు.

రిషు, రాణి డబ్బులు సంపాదించి థాయ్‌లాండ్ వెళ్లిపోయేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఓ రోజు పోలీసుల కంట పడుతుంది రాణి. అదే సమయంలో నీల్ మరణానికి కారణం తెలుసుకునేందుకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ మృత్యుంజయ్ ప్రసాద్ (జిమ్మీ షెర్గిల్) వస్తాడు. దాంతో అతని నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది రాణి.

ట్విస్టులు

పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యేందుకు రాణి వేసిన ప్లాన్ ఏంటీ? అసలు మృత్యుంజయ్ ప్రసాద్ ఎవరు? నీల్‌కు ఏమవుతాడు? రిషు బతికే ఉన్నాడని పోలీసులు కనిపెట్టారా? రాణి, రిషులు నేరస్థులను మృత్యుంజయ్ రుజువు చేయగలిగాడా? అనేది తెలియాలంటే ఫిర్ ఆయీ హీసన్ దిల్‌రూబా చూడాల్సిందే!

విశ్లేషణ:

రాణి బ్యూటిపార్లర్ రన్ చేయడం, తనను అభిమన్యు ప్రేమిస్తున్నాడు అని తెలిసే సీన్లతో సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత రిషును దొంగచాటుగా రాణి చూడటంతో మొదటి పార్ట్ సినిమా కథను ఒక్క పాటలో చూపించేశారు. ఏక్ హసీనా థి, ఏక్ దివానా థా అనే పాటతో చాలా బాగా మొదటి పార్ట్ కథను చెప్పేశారు. వీళ్లిద్దరు మళ్లీ వచ్చారంటూ సాగే గీతం బాగుంది.

దొంగ చాటుగా కలవడం

రాణి, రిషు థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు కష్టపడటం, అప్పుడప్పుడు దొంగ చాటుగా కలుసుకోవడం, కేవలం ఫోన్‌లోనే మాట్లాడుకోవడం, మరోవైపు రాణిని అభిమన్యు ప్రేమించడం ఫాస్ట్‌గా కథ సాగిపోతుంది. పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా మృత్యుంజయ్ ప్రసాద్ అడుగుపెట్టడంతో కథలో ట్విస్ట్ ఎదురవుతుంది.

ఇంట్రెస్టింగ్‌గా సీన్స్

తర్వాత వచ్చే సీన్స్ ఎంగేజింగ్‌గానే ఉంటాయి. రాణి, రిషు వేసే ప్లాన్‌ వల్ల అభిమన్యుకు ఏం అవుతుంది అనే క్యూరియాసిటీ, సస్పెన్స్ మొదలు అవుతుంది. పోలీసుల ఎంట్రీతో కేవలం గోడలపై కవితలతో రిషు, రాణి కమ్యునికేట్ చేసుకోడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే, పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొత్తగా మెప్పించదు.

బాగున్న ట్విస్టులు-క్లైమాక్స్ ఓకే

కొన్ని ట్విస్టులు బాగున్నాయి. మరికొన్ని తేలిపోయాయి. కొన్ని చోట్ల ఊహించేలా కథనం ఉంది. రొమాంటిక్, బోల్డ్ సీన్స్ పర్వాలేదు. బీజీఎమ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. కొత్తగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మరో సీక్వెల్ కోసమే అన్నట్లుగా క్లైమాక్స్ ఎండింగ్ ట్విస్ట్‌ను ఇంటలిజెంట్‌గా ప్లాన్ చేశారు. అంతేకానీ, పెద్దగా థ్రిల్‌కు గురి చేయదు.

తాప్సీ చీరకట్టు హైలెట్

మరోసారి రాణిగా తాప్సీ అదరగొట్టింది. తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా తన చీరకట్టుకు ఫిదా అవడం గ్యారెంటీ. విక్రాంత్ మాస్సే పర్పామెన్స్ బాగుంది. సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్ యాక్టింగ్ డీసెంట్‌గా అనిపించింది. మొదటి పార్ట్‌తో కంపెరింగ్ చేసుకోకుండా చూస్తే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా కూడా రెండు గంటల 13 నిమిషాలపాటు ఎంగేజ్ చేస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే నిరాశ చెందాల్సిన అవసరం రాదు.

రేటింగ్: 2.75/5