ఇటీవల టాలీవుడ్‌లో థియేటర్ల బంద్, పర్సెంటేజీ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇదివరకే అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలు, పర్సంటేజీపై మీడియాతో ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడారు.
ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదని నారాయణ మూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
"ఇటీవల సినీ పరిశ్రమలో పర్సంటేజి విధానం కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్‌లో చర్చల జరుగుతున్నాయి. ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినీ పరిశ్రమలో పర్సంటేజి సిస్టమ్ వస్తుందా అని ఎదురుచూస్తున్ దశలో.. నా లాంటి సగటు నిర్మాతలందరికి తీరని విఘాతం జరిగింది" అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.
"పర్సంటేజి ఇవ్వకపోతే హరి హర వీరమల్లు అనే సినిమాను ఆపడం కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం చాలా దుర్మార్గం. అదంతా ఉత్తదే. అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్ర దారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడటం కరెక్ట్ కాదు" అని నారాయణ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఎందుకంటే మిత్రులారా.. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమ పాలన సంస్థలు. ఆ రెండు సంస్థలు ఎప్పుడు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పలేదు. డిస్కన్షన్ ఆన్ గోయింగ్ అని చెప్పారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం" అని నారాయణ మూర్తి తెలిపారు.
"ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం మూడు వారాల ముందుగా తెలియజేయాలి. ఒక సమస్య మీద మేం పోరాడుతున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి మేం బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియజేయాలనేది నిబంధన" అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
"మూడు వారాల ముందు తెలియజేస్తే.. విడుదల తేది ప్రకటించుకున్నవాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జూన్ 1న బంద్ ప్రకటిస్తే ఒకవేళ.. జూన్ 12 అంటే రెండు వారాలు కూడా కావు కదా. ఏ రకంగా హరి హర వీరమల్లుకు బంద్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు" అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం