Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదట.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన రైటర్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పారు రైటర్ దశరథ్. పవన్ కల్యాణ్ హీరోగా రానున్న ఈ చిత్రం రీమేక్ కాదని అన్నారు. మరిన్ని విషయాలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కాస్త షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మూవీకి బ్రేక్ పడింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. దళపతి విజయ్ తమిళ మూవీ ‘తేరి’కి రీమేక్ అంటూ మొదటి నుంచి వినిపిస్తోంది. మూవీ టీమ్ కూడా రీమేక్ అన్నట్టుగానే వ్యవహరించింది. అందులోనూ హరీశ్ శంకర్ వరుసగా రీమేక్‍లే చేస్తున్నారు. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఈ మూవీ స్క్రీన్‍ప్లే రైటర్ దశరథ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

రీమేక్ కాదు.. కానీ
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరికి రీమేక్ కాదని దశరథ్ స్పష్టంగా చెప్పేశారు. కానీ ఈ చిత్రానికి పోలికలు దగ్గరగా ఉండటంతో అలా అనుకున్నారని అన్నారు. రాజేశ్ మన్నెకు ఇచ్చిన తెరవెనుక కథలు ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తేరితో పోలిస్తే ఎలాంటి మార్పులు చేస్తున్నారనే ప్రశ్న దశరథ్‍కు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. “మొదటి విషయం ఏంటంటే.. ఇది తేరి రీమేక్ కాదు. అప్పట్లో దానికి దగ్గరగా ఉండడం, మిస్ కమ్యూనికేషన్స్ జరిగిన విషయం వాస్తవం” అని దశరథ్ అన్నారు.
పవన్ అభిమానులకు పండుగలా..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కల్యాణ్ అభిమానులకు పండుగలా ఉంటుందనేలా దశరథ్ కామెంట్స్ చేశారు. పవన్‍లో అందరూ ఇష్టపడే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని అన్నారు. “సినిమా చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. పవన్ కల్యాణ్‍ను మనం సినిమాల్లో ఏఏ కారణాలతో ఇష్టపడ్డామో.. ఆ ఎలిమెంట్స్ అన్నీ మళ్లీ ఈ చిత్రంలో ఉంటాయి. ఆయన యాటిట్యూడ్, ఆయన డ్యాన్స్, పంచ్‍లు ఉంటాయి. ఇవి ఫ్యాన్ మూమెంట్ సినిమా. పవన్ కల్యాణ్ చిత్రాలు వేరే హీరోల ఫ్యాన్స్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ కోసం హరీశ్ శంకర్ చాలా బాగా డిజైన్ చేశారు” అని దశరథ్ చెప్పారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఏపీ ఎన్నికల ముందు ఓ టీజర్ వచ్చింది. జనసేన గుర్తుగా ఉన్న గాజుగ్లాస్ గురించి ఈ టీజర్లోని పవన్ కల్యాణ్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఒకప్పుడు గబ్బర్ సింగ్ హిట్‍ను పవన్‍తో తీశారు హరీశ్ శంకర్. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్‍పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‍గా ఉన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఏపీ ఎన్నికలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన సినిమాల షూటింగ్‍కు బ్రేక్ పడింది. అయితే, ఇటీవలే మళ్లీ షూటింగ్‍లను పవన్ మొదలుపెట్టారు. హరి హర వీరమల్లు మూవీని ముందుగా పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
హరి హర వీరమల్లు తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాన్ని మూవీని పవన్ ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కంప్లీట్ చేయనున్నారు.