Celebrities in Elections: పవన్ కల్యాణ్ నుంచి కంగనా వరకు.. ఎన్నికల్లో దుమ్ము రేపిన సెలబ్రిటీలు.. చిరంజీవి హీరోయిన్ కూడా..
Celebrities in Elections: లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు దుమ్ము రేపారు. భారీ మెజార్టీలతో విజయాలు సాధించారు. ఈ లిస్టులో ఒకప్పుడు చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ కూడా ఉంది.
Celebrities in Elections: పవన్ కల్యాణ్ నుంచి కంగనా రనౌత్ వరకు తాజాగా ముగిసిన లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా సెలబ్రిటీలు ఘన విజయాలు సాధించారు. వీళ్లలో ఎక్కువ భాగం బీజేపీ లేదా ఎన్డీయే తరఫునే కావడం విశేషం. వెస్ట్ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒకప్పుడు చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ రచన విజయం సాధించింది.
ఎన్నికల్లో గెలిచిన సెలబ్రిటీలు వీళ్లే..
పవన్ కల్యాణ్ - పిఠాపురం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తొలి విజయం సాధించాడు. అతడు పిఠాపురం నుంచి ఏకంగా 70 వేల పైచిలుకు ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై గెలిచాడు.
బాలకృష్ణ - హిందూపురం
ఇక టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతడు ఈసారి ఏకంగా లక్షా 7 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
కంగనా రనౌత్ - మండి (హిమాచల్ ప్రదేశ్)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది గెలిచింది. ఆమెకు ఏకంగా 74 వేలకుపైగా మెజార్టీ దక్కడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను ఓడించింది.
అరుణ్ గోవిల్ - మీరట్ ఎంపీ
రామాయణంలో రాముడి పాత్రతో ఎంతో మందికి చేరువైన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి బీజేపీ తరఫున విజయం సాధించాడు. అతడు ఎస్పీ అభ్యర్థి సునీత వర్మపై 10 వేలకుపైగా మెజార్టీతో గెలిచాడు.
శతృఘన్ సిన్హా - అసన్‌సోల్
వెస్ట్ బెంగాల్ లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన బాలీవుడ్ నటుడు శతృఘన్ సిన్హా సుమారు 60 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సురేంద్రజీత్ సింగ్ పై గెలిచాడు.
హేమామాలిని - మధుర
యూపీలోని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హేమా మాలిన మరోసారి బంపర్ మెజార్టీతో గెలిచింది. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. కాంగ్రెస్ భ్యర్థి ముకేశ్ దంగర్ పై సుమారు 3 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
రవికిషన్ - గోరఖ్‌పూర్
ప్రముఖ నటుడు, తెలుగులోనూ విలన్ గా నటించిన రవికిషన్ బీజేపీ తరఫున యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి గెలిచాడు. అతడు ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ పై లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
మనోజ్ తివారీ - ఢిల్లీ ఈశాన్యం
ఢిల్లీ ఈశాన్య నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మనోజ్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై 1.38 లక్షల ఓట్లతో గెలిచాడు.
రచన బెనర్జీ - హుగ్లీ
తృణమూల్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగింది ఒకప్పుడు టాలీవుడ్ లో నటించిన నటి రచనా బెనర్జీ. హుగ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై 76 వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది.
సురేశ్ గోపి - త్రిసూర్
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీకి చరిత్రాత్మక విజయం సాధించి పెట్టాడు మలయాళం స్టార్ నటుడు సురేశ్ గోపి. అతడు త్రిసూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి సీపీఐకి చెందిన సునీల్ కుమార్ పై 74 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. కేరళలో బీజేపీ గెలిచిన ఏకైక ఎంపీ సీటు ఇదే.